కాంగ్రెస్ పరాజయ పరంపరకు ప్రియాంక చెక్ పెడతారా?
posted on Nov 26, 2022 @ 10:49AM
ఎన్నిక ఏదైనా.. ఎక్కడైనా పరాజయం ఫిక్స్ అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఉంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనిపించినా.. ఏం మారలేదన్నది మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నిర్ద్వంద్వంగా తేల్చేసింది.
మునుగోడు ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడమే కాదు.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం రాష్ట్రంలో ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా తెరాసకు ఎంత సానుకూలత ఉందో.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూ అంతే సానుకూలత ఉండాలి. కానీ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచీ ఆ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇందుకు అంతర్గత విభేదాలు ఎంత కారణమో, పార్టీలో నాయకత్వ లోపమూ అంతే కారణం.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఉన్న అవకాశాలను పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భగ్నం చేశాయనడంలో సందేహం అవసరంలేదు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత క్యాడర్ లో జోష్ పెరిగినా పార్టీలో మిగతా నేతల వైఖరితో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళిలాగే ఉంది. అధ్యక్షుడితో పార్టీ సీనియర్లు కలిసి రాకపోవడం.. వర్కింగ్ ప్రెసిడెంట్లు యాక్టివ్ లేకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అందరికీ తెలిసిన విషయమే అయినా అధిష్ఠానం అసలు రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న వేసి సమాధానం కోసం అన్వేషించడం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ గాడిన పడకపోవడానికి కారణం ఏమిటి? రేవంత్ రెడ్డి సీనియర్లను దూరం పెడుతున్నారా? సీనియర్లే రేవంత్ కు దూరం జరుగుతున్నారా? అన్న విషయంపై గతంలో ఒక సారి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ హస్తిన లో భేటీ అయ్యారు.
ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత మరో సారి ప్రియాంక తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నేతలను పోవడం లేదా? ఇక తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక తన భుజస్కంధాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అంటే పేరుకు రేవంత్ టీసీసీసీ అధ్యక్షుడే అయినా.. అధికారాలన్నీ ప్రియాంకా తన వద్ద అట్టే పెట్టుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలు.. సమావేశాలు.. కార్యాచరణ అన్నీ ఆమె ఆదేశాల ప్రకారమే ఉంటాయని అంటున్నారు. ఇందుకు కారణం రేవంత్ తన సొంత అజెండాతో పని చేస్తున్నారంటూ సీనియర్లు పదే పదే అధిష్ఠానానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు. అన్నిటికీ మించి మర్రి శశిథర్ రెడ్డి పార్టీకి దూరం అవ్వడాన్ని కాంగ్రెస్ హై కమాండ్ ఒకింత తీవ్రంగానే పరిగణించిందని అంటున్నారు.
పార్టీలో సీనియర్ లంతా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టినట్లుగా వెళ్లి పోతుండటం, వారిని నిలువరించడానికి రేవంత్ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదన్న భావనతోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నిర్వహణ పగ్గాలను ప్రియాంక తన చేతికి తీసుకోవాలని నిర్ణయించారంటున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా పార్టీలో రేవంత్ దూకుడుకూ, అదే సమయంలో సీనియర్ల సహాయ నిరాకరణకూ చెక్ పెట్టినట్లౌతుందన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రియాంక నేరుగా పర్యవేక్షిస్తేనైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగౌతుందా అన్నది వేచి చూడాల్సిందే. పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ప్రజలతో సంబంధాలు తెగిపోవడమే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి కారణమంటున్నారు.