పశువులకు మరణశాసనం రాస్తున్న కొత్త వైరస్
posted on Nov 26, 2022 @ 11:09AM
దేశంలో బయటపడిన ఒక వైరస్ మరణశాసం లిఖిస్తోంది. అయితే ఈ వైరస్ మనుషులకు కాదు.. పశువులకు మృత్యు పాశంగా మారింది. ఈ వైరస్ నే లంపి చర్మ వ్యాధి అని అంటారు. ఈ వ్యాథి వేగంగా వ్యాపిస్తోంది. ఇన్ఫెక్షన్ సోకగానే ఈ చర్మ వ్యాధి పశువు చర్మం మొత్తం వ్యాపిస్తున్నది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తో సహా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఈ వ్యాధి బారిన పడి మూడు లక్షల పశువులు చనిపోయాయి.
అయితే మిగిలిన రాష్ట్రాల కంటే రాజస్థాన్ లో పశువులలో ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. లంపి స్కిన్ డిసీజ్ రాజస్థాన్, గుజరాత్ లో భయంకరమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్, రాజస్థాన్ లోనే 70 వేలకు పైగా పశువులు మరణించాయి.
గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ నివేదిక ప్రకారం, లంపి చర్మ వ్యాధి కాప్రిపోక్స్ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఇది “ప్రపంచవ్యాప్తంగా పశుసంపదకు పెను ముప్పుగా పరిణమించనుంది. ఈ వైరస్ సాధారణంగా ఈగలు, దోమలు లేదా పేల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో దీర్ఘకాలిక బలహీనత, పాల ఉత్పత్తి క్షీణత, పెరుగుదల ఆగిపోవడం, వంధ్యత్వం, గర్భస్రావం, చివరిగా మరణం సంభవిస్తాయి.