మళ్లీ జగన్ బీసీ కార్డ్.. మరో సారి జనం ముందుకు వైసీపీ బీసీ నేతలు?
posted on Nov 26, 2022 @ 10:21AM
దిగజారిపోతున్న ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి జగన్ పార్టీలోని బీసీ నేతలపై ఆధారపడనున్నారా? ఇప్పటికే ఒక సారి బీసీ మంత్రులను బస్సు యాత్రపేరిట రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి భంగపడిన జగన్ మరోసారి అదే దారిలో నడవనున్నారా? అందుకే బీసీ నేతలతో సమావేశం అవుతున్నారా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జోగి రమేష్ గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, పార్థసారథి, జంగాకృష్ణ మూర్తి, అనిల్ కుమార్ యాదవ్ సహా పార్టీలోని బీసీ నేతలందరూ జగన్ తో భేటీ అయ్యారు.
భేటీ వివరాలు వెంటనే బయటకు తెలయరాలేదు. అయినా ఈ సమావేశంలో జగన్ వారికి మరో సారి ఆవు కథ వినిపించారనీ, ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న పథకాలను ఏకరవు పెట్టారనీ, వీటన్నిటినీ బీసీలలో విస్తృతంగా ప్రచారం చేసి వారిని పార్టీకి దగ్గర చేసే బాధ్యతను పార్టీలోని బీసీ నేతలంతా తీసుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అసలు పార్టీలోని బీసీ నేతలతో జగన్ భేటీకి కారణం కూడా ఇదేననీ అంటున్నారు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్ బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.
కేబినెట్ లో సముచిత స్థానం లేకపోవడం.. మంత్రివర్గ పునర్వ్వవస్థీకరణలో ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది బీసీ నేతలే కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా బీసీ నేతలకు జగన్ న్యాయం చేయలేదన్న అసంతృప్తి వారిలో గూడుకట్టుకుని ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం వారి అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయత్నం చేయలేదంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలో గట్టెక్కాలంటే.. బీసీల మద్దతే శరణ్యం అన్న భావనతో బీసీ నేతలతో జగన్ బేటీ అయ్యారనీ, అయితే ఈ భేటీలో కూడా వారిలో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం కాకుండా.. బీసీ నేతలుగా పార్టీకి బీసీలను దగ్గర చేయాల్సిన బాధ్యత మీదే అన్న హుకుం జారీ చేయడానికే పరిమితమయ్యారని అంటున్నారు.
ఈ భేటీతో వైసీపీ బీసీ నేతల్లో అసంతృప్తి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పి కొట్టడానికి, బీసీల మద్దతు కూడగట్టడానికి బీసీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు జగన్ పురమాయించారని అంటున్నారు.