ఆ మూడు రాష్ట్రాలకూ కడుపు మంట ఎందుకు?
posted on Oct 18, 2025 @ 11:01AM
ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి పెట్టేందకు ముందుకు రావడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు చాణక్యాన్నీ, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చూపుతున్న ప్రతిభ పట్ల ప్రపంచం మొత్తం అచ్చెరువోందుతోంది. అయితే దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మాత్రం కడుపుమంటతో గిలగిలలాడుతున్నాయి. వాటితో పాటు.. ఆంధ్రప్రదేశ్లో జనం ఇవ్వకపోయినా, విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా బహిష్కరించి, ప్రెస్ మీట్లలో ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతున్న వైసీపీ కూడా గొంతు కలుపుతోంది.
ఇంతకీ ఆ మూడు రాష్ట్రాలూ ఏవంటే.. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఐటీ హబ్ గా గుర్తింపు పొందింది. కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయినా కూడా ఏపీతో పోటీ పడటంలో వెనుకబడింది. దీనిపై రాష్ట్రంలో చిన్నసైజు రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది.
ఇక బెంగళూరు విషయానికి వస్తే.. అక్కడ అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం నిష్క్రియాపరత్వం కారణంగా ఉన్న కంపెనీలే పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అలాంటి పరిశ్రమలకు ఏపీ ఆహ్వానం పలకడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఈ పరిస్థితుల్లో గూగుల్ వంటి అగ్రసంస్థ భారీ పెట్టుబడితో ఏపీలో అడుగుపెట్టడంతో అనుచిత రాయతీలతో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని శాపనార్ధాలు పెడుతోంది.
ఇక తమిళనాడు కడుపుమంట మరో టైపు. గూగుల్ సీఈవోగా తమ రాష్ట్రానికి చెందిన సుందర్ పిచాయ్ ఉన్నా కూడా ఆ సంస్థ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఏపీని ఎన్నుకోవడమేంటంటూ అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతం సాధించారు, మీరేం చేస్తున్నారంటూ విశ్లేషకులు టీవీ టాక్ షోలలో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీ ఈ స్థాయిలో ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందంటే అందుకు ఇక్కడ ప్రభుత్వాధినేతకు రాష్ట్ర ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల ఆగ్రహం, అసూయకు కారణమేంటయ్యా అంటే ఏపీ ప్రగతి ఆయా రాష్ట్రాలలో వారికి పొలిటికల్ గా నష్టం చేస్తుందన్న భయమేనంటున్నారు.