టీఆర్ఎస్ దాడుల వెనుక వ్యూహమేంటి? కేసీఆర్ ఇంత స్కెచ్ వేశారా?
posted on Nov 16, 2021 @ 4:33PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటనలు చాలా సార్లు చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. కాని ఏనాడు అడ్డంకులు రాలేదు. కాని రెండు రోజులుగా బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు నల్గొండ జిల్లాకు వచ్చిన సంజయ్ ను అడ్డుకునేందుకు అడుగడుగునా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కొన్నిప్రాంతాల్లో ఆయన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు విసిరారు. పోలీసులు నాలుగైదు ప్రాంతాల్లో లాఠీచార్జీ చేశారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో ఊహించవచ్చు.
సహజంగా ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు నిరసనలు ఎదురవుతుంటాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు తమ సమస్యలపై జనాలు వాళ్లను నిలదీస్తుంటారు. కాని ప్రస్తుతం తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విపక్ష నేతలు జనాల్లోకి వెళుతుంటే.. అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. అంతేకాదు అధికార పార్టీనే ఏకంగా బంద్ కు పిలుపిస్తోంది. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. అధికార టీఆర్ఎస్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.
బీజేపీ టార్గెట్ గా నిరసనలు తెలపడం, బండి సంజయ్ పై దాడికి యత్నించడం వెనుక గులాబీ పార్టీకి బలమైన వ్యూహమే ఉందంటున్నారు. హుజురాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా, వందల కొట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ ను ఓడించలేకపోయింది. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ పై జనాల్లో మరింత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. ఎన్నికల కోడ్ తో దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై చిందులు తొక్కారు. ఎన్నికలు ముగియగానే దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ ఆపుతారో చూస్తానంటూ ప్రకటన చేశారు.
అయితే నవంబర్ రెండో వారం కూడా ముగిసింది. అయినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్. లబ్దిదారులకు 10 లక్షల పంపిణీ జాడే లేదు. దళిత బంధు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. కొత్తగా రుణాలు దొరికే పరిస్థితి కూడా లేదు. దళిత బంధు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అందులోభాగంగానే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ నిరసనలు చేయడం, బీజేపీ నేతలను టార్గెట్ చేయడం జరుగుతుందని అంటున్నారు.హుజురాబాద్ ఓటమి, నవంబర్ 4 నుంచి దళితబంధు అమలు విషయం మరుగున పరిచేందుకే.. కేసీఆర్ బీజేపీని రెచ్చగొట్టి ఆ రచ్చలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
టీఆర్ఎస్ వ్యూహంతో కొన్ని రోజులుగా దళిత బంధు అంశం, హుజురాబాద్ ఉప ఎన్నికపై కాకుండా ధాన్యం కొనుగోళ్లు, బీజేపీ నేతలతో మాటల యుద్దంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు రోజులుగా సంజయ్ పై జరుగుతున్న దాడులతో మేటర్ పూర్తిగా సైడ్ ట్రాక్ లో పోయింది. కేసీఆర్ అనుకున్నట్లే దళిత బంధు, హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాలు మరుగునపడ్డాయనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎత్తుల్లో భాగంగానే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులకు తెగబుడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి