పవన్ దెబ్బకు దిగొచ్చిన జగన్.. రోడ్ల రిపేర్లపై రివ్యూ
posted on Nov 16, 2021 @ 5:00PM
దెబ్బకు దెయ్యం వదిలిందంటే ఇదేనేమో! జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకు ఏపీ సీఎం జగన్ ఇప్పుడు దిగొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ శిథిలావస్థకు చేరిపోయాయి. ‘ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం..‘ చందంగా మారిపోయాయి. రోడ్లన్నీ గుంతలతోనూ.. కంకర తేలిపోయి దర్శనం ఇస్తున్నాయి. మచ్చుకైనా ఒక్క అంగుళం మేర డాంబర్ రోడ్డు కనిపించని దుస్థితి ఏపీలో ఉంది. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
పవన్ కళ్యాణ్, జనసైనికుల శ్రమదానంతో సీఎం జగన్ కళ్లకు ఉన్న గంతలు ఊడిపోయాయి. ఏపీలో రోడ్ల దుస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలోని అన్ని రోడ్లపై గుంతల్ని తక్షణమే పూడ్చాలన్నారు. నెలాఖరుకు టెండర్లు పూర్తిచేసి 8,268 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. కేటగిరితో నిమిత్తం లేకుండా మొత్తం 46 వేల కిలోమీటర్ల రోడ్లకు 2022 జూన్ నాటికి మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తవ్వాలని నిర్దేశించారు.
ఏపీలో శిథిలావస్థకు చేరిన రోడ్ల దుస్థితిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ‘అడుగుకో గుంత, గజానికో గొయ్యి‘ అంటూ తీవ్రంగా స్పందించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2 ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో, మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి- ధర్మవరం రోడ్డుకు శ్రమదానంతో మరమ్మతులు చేశారు. ఇక జనసేన శ్రేణులు ఏపీలోని అనేక చోట్ల శ్రమదానంతో రోడ్ల మరమ్మతు కార్యక్రమం ఓ ఉద్యమంలా నిర్వహించారు.
అంతకు ముందే పవన్ కళ్యాణ్ ఏపీలోని రోడ్ల దుస్థితిపై తీవ్రంగా స్పందించారు. నెల రోజుల్లో ప్రభుత్వం రోడ్లు మరమ్మతు చేయాలని డెడ్ లైన్ విధించారు. అప్పటికీ సర్కార్ పట్టించుకోకపోతే తానే స్వయంగా జనసైనికులతో కలిసి రోడ్ల మరమ్మతు చేస్తానని ప్రకటించారు.
ఏదేమైతేనేం.. రోడ్లపై గుంతల్ని పూడ్చే ప్యాచ్ వర్క్ వెంటనే చేయాలని, ఆ తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశించారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకుని, వారంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాని సీఎం స్పష్టం చేశారు.
రాజకీయ నేతలు ఎంతమంది ఏపీలో ఉన్నా.. రోడ్ల దుస్థితి కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. నిలదీయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోయారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రతి సమస్య పైనా నిలదీస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై పవన్ స్పందించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు. కిడ్నీ సమస్యపై నిపుణులతో అధ్యయనం చేయించారు. పవన్ స్పీడుతో బేజారెత్తిన రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టింది. ఆ ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఓ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటైంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ సమస్యపై స్పందిస్తే.. ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారానికి ముందుకు వస్తోంది. జనం నుంచి ఓట్ల రూపంలో తీసుకున్న లబ్ధిని తిరిగి జనానికే ఇవ్వాల్సిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు. లేదంటే ప్రభుత్వ పెద్దలు లావైపోతారు కదా!