యథేచ్చగా ‘మట్టి’ స్మగ్లింగ్.. జగన్ సర్కార్ సైలెంట్!
posted on Nov 10, 2021 @ 2:53PM
కృష్ణాజిల్లా నూడివీడు రెవెన్యు డివిజన్‌లో మట్టి మాఫియా రెచ్చిపోయింది. నూజివీడు మండలం దిగవల్లి గ్రామంలో చిన్నగట్టు పెద్దగట్టు ప్రాంతంలో యధేచ్చగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టిని దాదాపు 30 ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఈ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారని అడిగే నాధుడే కరువయ్యాడు. ఈ విషయం అధికారులకు తెలిసి కూడా వారు ఏమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇంటి మేరువాకు ఓ ట్రాక్టర్ మట్టి కావాలంటే రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ, సచివాలయానికి చెందిన అధికారుల అనుమతి కావాలి. ఓ వేళ సదరు వీరంతా అనుమంతించినా.. స్థానిక నేతల అనుగ్రహం కూడా ఉండాలి. అలా ఉంటేనే గుప్పెడు ఇసుక అయినా, తట్టెడు మట్టి అయినా ప్రజలకు అందుతోంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే ట్రాక్టర్లకు ట్రాక్టర్ల ట్రక్కుల మట్టి అక్రమంగా తరలిపోతున్న తీరుతో పరిసర గ్రామాల ప్రజలు అవాక్కు అవుతున్నారు.
ఇదేమని రెవెన్యూ శాఖ అధికారులు ప్రశ్నిస్తే.. జగనన్న కాలనీల ఇళ్లు నిర్మాణం కోసం సదరు మట్టిని వినియోగిస్తున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అనుమతులు ఏవీ అంటే.. అధికారులు దృష్టికి తీసుకెళ్లాం.. వారు వస్తున్నారని కుంటి సాకులు చెబుతున్నారని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే జగనన్న కాలనీలను పరిశీలిస్తే, ఆయా ప్రాంతాల్లో తట్టెడు మట్టి కూడా కనిపించడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మరి తరలిపోతున్న మట్టి ఎక్కడికి పోతుందనేది మాత్రం తెలియడం లేదు. అసలు ఈ మట్టిని ఎవరు తరలిస్తున్నారు. దీని వెనక ఎవరి హస్తం ఉంది. ఈ మట్టి మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవరు అని ప్రజాసంఘాల నేతలు, సామాజిక వేత్తలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఈ మట్టి మాఫియాల ఆటలు కట్టించే అధికారి జాడ లేక, యధేచ్ఛగా వందలాది లోడ్లు తరలిస్తూ బ్లాక్ మార్కెట్లో ఈ మట్టిని అమ్మకానికి పెడుతున్నారని సమాచారం. కృష్ణాజిల్లా కలెక్టర్ స్వయంగా ఈ ఘటనలో చొరవచూపి బాధ్యులను కఠినంగా శిక్షించి, గ్రామంలోని మట్టిని స్థానిక జగనన్న కాలనీల నిర్మాణాలకు వినియోగించాలని గ్రామస్తులు ముక్తకంఠంతో అధికారులను కోరుతున్నారు.