వరిపై తుస్.. తెరపైకి కంటోన్మెంట్! కేటీఆర్ డైవర్ట్ గేమ్..
posted on Dec 21, 2021 @ 4:28PM
కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది టీఆర్ఎస్. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది టీఆర్ఎస్. అయితే వరి విషయంలో గులాబీ పార్టీ ఆరోపణలను లైట్ తీసుకుంది మోడీ సర్కార్. కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టింది. సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వరి విషయంలో కేసీఆర్ తీరును ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
వరి కొనుగోళ్లపై రచ్చ సాగుతుండగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రోడ్ల మూసివేతపై కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో చట్టవిరుద్ధంగా రోడ్లను మూసివేసి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. లోకల్ మిలటరీ అథారిటీస్ (ఎల్‌ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్ ద్వారా పంపించారు.
లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు కేటీఆర్. ఇదిగో జాబితా.. ఆయా రోడ్లను తక్షణమే తెరిచేలా లోకల్ మిలటరీ అథారిటీస్‌కు ఆదేశాలిస్తూ లక్షలాది మంది స్థానికులకు ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం అంటూ కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు.అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మీ మంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేనట్లుంది.. కంటోన్మెంట్‌లో మొత్తం 21 రోడ్లు మూసేస్తే, మీ మంత్రి కేవలం రెండే మూసేసినట్లు చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఓవైపు వరి విషయంలో మోడీ సర్కార్ తో వార్ సాగుతుండగానే.. కేంద్రం పరిధిలోని కంటోన్మెంట్ సమస్యలను కేటీఆర్ బయటికి తీయడం చర్చగా మారింది. నిజానికి కేటీఆర్ చెబుతున్న కంటోన్మెంట్ రోడ్ల సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. రోడ్లను కొన్ని సార్లు ఓపెన్ చేయడం... కొన్ని సార్లు క్లోజ్ చేయడం జరుగుతోంది. అయినా ఆ సమస్యను కేటీఆర్ కొత్తగా బయటికి తీయడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. వరి విషయంలో కేంద్రాన్ని ఇరికించాలని చూసిన వర్కవుట్ కాకపోవడంతో.. కేటీఆర్ ఇలా నరుక్కొచ్చారని అంటున్నారు. కంటోన్మెంట్ సమస్య ద్వారా ప్రజల దృష్టిలో మోడీ సర్కార్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. వరి విషయంలో కేంద్రమంత్రి గోయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో డిఫెన్స్ లో పడిన గులాబీ లీడర్లు.. ఆ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కమలం నేతలు చెబుతున్నారు.