హోదా కాదు ప్యాకేజీనేనట.. ఇకనైనా జగనన్న పోరాడేనా?
posted on Dec 21, 2021 @ 4:19PM
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే మా లక్ష్యం.. మాకు అధికారం ఇస్తే కేంద్రంతో పోరాడి.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం... ఇచ్చిన మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదం. ప్రతి ఎన్నికల సభలోనే ఆయన చెప్పింది ఇదే. కాని ఆయనకు అధికారం వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఏపీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. వచ్చే అవకాశాలు కూడా కన్పించడం లేదు. అయినా జగన్ రెడ్డిలో మాత్రం ఉలుకూ పలుకూ లేదూ. ప్రత్యేక హోదా అనే అంశం ఆయనకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లోనూ వైసీపీ ఎంపీలు సైలెంటుగానే ఉంటున్నారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి అడగటం లేదని భావిస్తున్నారు.
తాజాగా ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చింది మోడీ సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నీతి అయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
పార్లమెంట్ లో కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కేంద్ర తన నిర్ణయాన్ని చెప్పింది కాబ్టటి ఇకనైనా జగన్ రెడ్డి పోరాటం చేస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే గత రెండున్నర ఏళ్లుగా ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం మాట్లాడని జగన్... ఇకపై కూడా మాట్లాడతారనే నమ్మకం లేదంటున్నారు ఏపీ జనాలు. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటనలు చేస్తుండటం తప్ప జగన్ రెడ్డి చేస్తున్నదేమి లేదంటున్నారు. తన కేసుల కోసం ప్రత్యేక హోదాను జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ రెడ్డి కూడా ఏమి మాట్లాడకపోతుండటంతో అదే నిజమేననే అభిప్రాయం వస్తోంది. ఇకనైనా జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడకపోతే.. కేసుల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపణలు నిజమననే జనాలు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.