న్యూఇయర్ వేడుకలపై నిషేధం.. 4 రోజుల పాటు ఆంక్షలు..
posted on Dec 21, 2021 @ 4:34PM
అనుకున్నట్టే జరిగింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై పడింది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు డబుల్ సెంచరీ దాటేయడంతో.. సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక, మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనుండటంతో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు.. నాలుగు రోజుల పాటు ఎలాంటి బహిరంగ పార్టీలు, సామూహిక వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పబ్‌లు, రెస్టారంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
"కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై నిపుణులతో చర్చించాం. వారి సిఫార్సుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాం. డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నాం. పబ్‌లు, రెస్టారంట్లలో 50శాతం సామర్థ్యంతో న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదు. ఇక రెండు డోసుల టీకా తీసుకోనివారిని పబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతించకూడదు. అదే విధంగా, అపార్ట్‌మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నాం" అని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
కర్నాటక బాటలోనే తెలుగు రాష్ట్రాలు సైతం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. కర్నాటకలో ఇప్పటి వరకూ 19 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 20 దాటేసింది. హైదరాబాద్‌లో పార్టీ కల్చర్ ఎక్కువ కాబట్టి.. కర్నాటక మాదిరే తెలంగాణలో కూడా న్యూఇయర్ ఈవెంట్స్‌పై ఆంక్షలు తప్పకపోవచ్చు అంటున్నారు.