హుజురాబాద్ కు కేటీఆర్ దూరం.. కారణం ఇదేనా?
posted on Oct 2, 2021 @ 2:38PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. తొలి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. హుజురాబాద్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది టీఆర్ఎస్. తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఈటల రాజేందర్ ను ఓడించాలనే కసితో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనే+ స్వయంగా ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో తిరుగుతున్నారు. అయితే మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తుండగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మాత్రం హుజురాబాద్ వైపు వెళ్లడం లేదు.
నిజానికి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. కరీంనగర్ జిల్లా పరిధిలోనే హుజురాబాద్ ఉన్నా... కేటీఆర్ మాత్రం అక్కడ కనిపించడం లేదు. పార్టీకి అత్యంత కీలకం కావడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి కీలకమైన ఎన్నిక జరుగుతున్నా... కేటీఆర్ హుజురాబాద్ లో ప్రచారం చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అయితే కేటీఆర్ హుజురాబాద్ వెళ్లకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు.
సీఎం కేసీఆరే కావాలని కేటీఆర్ ను హుజురాబాద్ ప్రచారానికి దూరం పెట్టారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఆయన లింకులు బయటపడ్డాయని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కేటీఆర్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వర్షాలకు వరదలతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్ని అతలాకుతలం అయ్యాయి. వరద నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఉపఎన్నికలో కేటీఆర్ ప్రచారంలోకి దింపితే అంతిమంగా జనాల వ్యతిరేకత పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపుపై ప్రభావం చూపుతుందని కేసీయార్ కు రిపోర్టు వచ్చిందట.
అందుకనే కేటీఆర్ ను హుజురాబాద్ దూరం పెట్టేసి మొత్తం బాధ్యతను మేనల్లుడు హరీష్ రావు మీదే కేసీఆర్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు విషయంలో కేసీయార్ ఎలాంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదని అర్ధమైపోతోంది. కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నా... అత్యంత కీలకమైన ఉప ఎన్నికలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రచారం చేయకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. హుజురాబాద్ లో ఓడిపోతాయమని తెలుసు కాబట్టే కొడుకు కేటీఆర్ ను ప్రచారం చేయమని కేసీఆర్ చెప్పడం లేదనే టాక్ కూడా ఉంది. దుబ్బాక తరహాలోనే పార్టీ ఓటమి భారాన్ని హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది.