కొత్త పార్టీ దిశగా కెప్టెన్.. పంజాబ్ లో కాంగ్రెస్ షేక్!
posted on Oct 2, 2021 @ 2:38PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. అయినా, గత కొంత కాలంగా రాజకీయ చిక్కుముళ్ళలో చిక్కుకుని, అంతు చిక్కని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పంజాబ్ రాజకీయం దుస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో సిద్దూ రగిల్చిన చిచ్చు ఎంతకీ చల్లారడం లేదు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నసుదీర్ఘ అనుబందాన్ని తెంచుకుని బయటకు వచ్చిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్,అవమాన భారంతో రగిలి పోతున్నారు. సిద్దూను ఓడించి తీరతానని శపథం చేశారు. మరో పక్షం రోజుల్లో కొత్త ప్రాతీయ పార్టీ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన పార్టీ పెడితే,కొందరు ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటుగా అకాలీ దళ్, బీజేపీ మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు కొందరు ఆయన పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం అమరీందర్ సింగ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్’ను కలవడం, సహజంగానే కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది.మాజీ ముఖ్యమంత్రి అమిత్ షాను కలవడంతో, ఆయన లౌకికవాదం మైల పడిపోయిందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్, ఆరోపించారు. అలాగే, కెప్టెన్ అమరీందర్ సింగ్, సైద్ధాంతిక అనుబంధం లేని వ్యక్తులతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. దీంతో చర్చ మరో మలుపు తిరిగింది. హరీష్ రావత్ వ్యాఖ్యలను కెప్టెన్ తీవ్రంగా ఖండించాఋ. రావత్ విమర్శ కాంగ్రెస్ పార్టీ దయనీయస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.నిజానికి, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం జాతీయ స్థాయిలోనూ కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు, జీ 23 అంటే,జీ హుజూర్’ కాదని కపిల్ సిబల కుండ బద్దలు కొట్టారు.ఆయన ఇంటిమీద కాంగ్రెస్ కార్యకర్తలు దడి చేశారు. ఈ దాడిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఖండించారు అదొక వివాదం ఆలా నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా అమరీందర్ సింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యంత దగ్గరి చుట్టం, చాలా దగ్గరి మిత్ర పక్షం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ),పంజాబ్ పరిణామాలను, బీహార్’లో కన్హయ్య కుమార్’ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ముడివేసి వ్యంగ్య విమర్శలకు దిగింది. కన్హయ్య కుమార్, కాంగ్రెస్ పాలిట మరో నవజ్యోతిసింగ్ సిద్దూ అవుతారని, ఆర్జేడీ సీనియర్ నాయకుడు, శివానంద తివారీ ఎద్దేవా చేశారు. కురువృద్ద కాంగ్రెస్ పార్టీని, కన్హయ్య కుమార్ సర్వనాశనం చేస్తాడని ఆర్జేడీ నేత అన్నారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ, ఆ పార్టీని కన్హయ్య కాదు, ఇంకెవరు వచ్చినా రక్షించ లేరు అని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిత్ర పక్షం కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, తప్పుడు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పార్టీ సిద్దాంతం పట్ల నిబద్దతగల సీనియర్ నాయకులను వదులుకుని, సిద్దూ, కన్హయ్య వంటి నిబద్దత లేని, నాయకులు కానీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వు కుంటోందని తివారీ అన్నారు.
కాంగ్రెస్ నాయకత్రయం మాత్రం పార్టీలోచీలిక వచ్చినా ఓకే కానీ, సీనియర్ నాయకుల వత్తిళ్ళకు తలోగ్గేది లేదని అధికార ప్రతినిధుల ద్వారా స్పష్టమైన సంకేటాలనే ఇస్తోంది.అమరీందర్ సింగ్’ ను పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిని, మూడుసార్లు పీసీసీ అధ్యక్షుని చేసిందని, అయినా, ఆయన పార్టీలో తనకు అవమానం జరిగిందని అనడం విడ్డూరంగా ఉందని రావత్ అన్నారు. అయితే, అమరీందర్ సింగ్ ఆయనకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. సిద్దూ, పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నెలల తరబడి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నతనను సోషల్ మీడియాలో ఇతరత్రా ఎంతగా విమర్శించినా, దుర్భాషలాడిన, దుయ్యబట్టినా , చివరకు ప్రభుత్వ విధానాలను విమర్శించినా ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం అవమానించడం కాదా, అని కెప్టెన్ ప్రశ్నించారు. అంతేకాదు, తనంతట తానుగా రాజీనామాకు సిద్దమైనప్పుడు కాదని, అంతలోనే తనకు తెలియకుండానే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, సాగనంపాలనుకోవడం అవమానం కాదా, అని కూడా ఆయన ప్రశ్నించారు.కాగా,జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పంజాబ్ రాజకీయలు ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో, 1969 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, మరో మారు పార్టీలో అదే స్థాయిలో చీలిక వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని, శేఖర్ గుప్తా సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.