ఈటల ప్రమాణానికి సంఘ్ నేతలు డుమ్మా! కమలంలో కోల్డ్ వార్ మొదలైందా?
posted on Nov 10, 2021 @ 6:40PM
తెలంగాణ బీజేపీలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్థానం ఏమిటి? కమల దళం పరీక్షలను తట్టుకుని, ఆయన పార్టీలో నిలబడతారా? ఆ పార్టీలో ఇమడగలుగు తారా? ఇలా ఈటల, బీజేపీ సంబంధాలకు సంబంధించి, అనేక ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చకు వస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఈటల, బీజేపీ సంబంధాలు ఈ రోజు వరకు, నొవ్వొకందుకు పోస్తుంటే, నేనొకందుకు తాగుతున్నాను అనే రీతిలోనే సాగుతున్నాయి. భవిష్యత్’లో ఎలా ఉంటాయి అనే విషయాన్ని పక్కన పెడితే..ఈటల బీజేపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
కారణాలు ఏవైనా సంఘ్ పరివార్ నుంచి వచ్చిన కోర్ బీజేపీ నాయకులు ఎవరూ ఈటల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒక విధంగా చూస్తే మాజీ తెరాస నాయకులే ప్రధానంగా ఈటల వెంట ఉన్నారు, ఇదొక ఆసక్తికర అంశం అయితే, తెరాస వ్యతిరేక శక్తులు, ఉద్యమనాయకులు అందరినీ ఏకం చేసి, మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగతున్న చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం, గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కేసీఆర్ నైజం బయటపడిన నేపధ్యంలో ఉద్యమకారులు తెరాసను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో ఆయన తమ సొంత అజెండాతోపాటుగా పార్టీ (బీజేపీ) అజెండాను ముందుకు తీసుకు పోతాను అన్నట్లుగా రెంటి మధ్య ఇంకా ఏదో పలచని గీత/ వ్యత్యాసం ఉందనే అర్థంవచ్చే రీతిలో మాట్లాడారు. మళ్ళీ ఆయనే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. ఇది (హుజూరాబాద్ గెలుపు)ఆరంభం మాత్రమేనని అంటూ, ‘‘బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తా. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండానే”. అని ముక్తాయింపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్’ రెండు రోజుల పాటు గంటల తరబడి నిర్వహించిన ప్రెస్ మీట్ల పైనా ఈటల గట్టిగానే చురకలు అంటించారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుకే కేసీఆర్‌కు దిమ్మతిరిగితే.. యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ తప్పు చేయనట్టు కాదన్నారు. కేసీఆర్ మాటల్లో నిజం లేదని, విశ్వసనీయత అసలే లేదని ఈటల చెప్పారు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నాడని, అందుకే ఉద్యమకారులెవరూ కేసీఆర్ వెంట ఉండొద్దని అన్నారు.
అయితే ముఖ్యమంత్రి, ప్రభుత్వయంత్రాంగం, అధికార పార్టీ అస్త్రశస్త్రాలు అన్నిటినీ ఓడించి, అపూర్వ విజయాన్ని తెచ్చిన ఈటల ప్రమాణ స్వీకారానికి, బీజేపీ కోర్ లీడర్స్ ఎందుకు హాజరు కాలేదు.. ఇంకా.. అయన మీద కమల నాదులకు అనుమానాలున్నాయా..అలాగే ఈటల కూడా ఇంకేదైనా ఆలోచనలో ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇంకా ఇప్పటికీ బీజేపీ ఈటల సంబంధాల్లో ఎవరికి ఉండే సందేహాలు వారికున్నాయి.ముందే అనుకున్నట్లుగా ఇంకా ఈ నాటికీ, ఈటల, బీజేపీ సంబంధాలు నువ్వొకందుకు పోస్తుంటే నేనొకందుకు తాగుతున్నాను, అనే రీతిగానే సాగుతున్నాయి. మరో వంక ఈటల బీజేపీలో మరో పవర్ సెంటర్ కానున్నారా అనే చర్చ కూడా సాగుతోంది.