Read more!

ఆహారమే ఆరోగ్యమంటారు ఎందుకు?

ఆరోగ్యానికి ఆయువుపట్టు మనం తీసుకునే ఆహారం. ఆహారం నియమబద్ధంగా ఉండాలి. మనం బ్రతకడానికి తినాలి. అంతే కానీ తినడం కోసమే బ్రతకకూడదు. పౌష్టికాహారాన్ని నియమబద్దంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ నియమబద్ధమైన ఆహారం కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఇది అన్ధశ్రీ హక్కు. దీన్ని అందరూ తీసుకోవాలి. క్రొవ్వు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మితంగా తినాలి, బాగా పనిచేయాలి. ఎప్పుడూ హుషారుగా ఉండాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పోషించేవి విటమిన్స్. న్యూట్రిషన్ ఫుడ్ అంటే సంపూర్ణాహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, సంపూర్ణ ఆహారం క్రిందకు వస్తాయి.

నువ్వెంత తిన్నావని కాదు ప్రశ్న. ఏ రకమైన ఆహారం తీసుకున్నావన్నది ముఖ్యం. మనం తీసుకునే ఆహారం మనకు ఆరోగ్యదాయకం కాకపోయినా మనకు అనారోగ్యాన్ని చేకూర్చకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. 

బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? అని చాలా మంది సందేహం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, క్రొవ్వు పదార్థాలు ఉండాలి. ప్రతి వ్యక్తికి కొంతశాతం అంటే కొన్ని కేలొరీల శక్తి గల ఆహారం కావాలి. కేలొరీల శక్తి మరీ తగ్గకూడదు. మరీ హెచ్చు కాకూడదు. రెండూ కూడా మన ఆరోగ్యానికి హానికరమే ! సామాన్యంగా మనం తీసుకునే ఆహారంలో తక్కువ కేలరిక్ వేల్యూ ఉండాలి. న్యూట్రిషన్ వేల్యూ, ఫుడ్ వేల్యూ హెచ్చుగా ఉండాలి. ముందుగా పౌష్టికాహారానికి కావలసింది ప్రోటీన్స్. అవి బాగా ఉండేలా చూసుకోవాలి.

శరీరానికి బలం చేకూర్చడానికి ప్రోటీన్స్ తో పాటు, కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. చాలా మందికి కార్బొహైడ్రేట్స్ మూలంగా లావెక్కుతారనే అపోహ ఉంది. ఎక్కువగా ఏ రకమయిన ఆహారం తీసుకున్నా ప్రమాదమే. కొవ్వు పదార్థాలను కూడా మితిమీరి తీసుకోరాదు. నిజానికి శరీర దారుఢ్యతకు కొవ్వు ఎంతో అవసరం. కొవ్వు పదార్థాలను అసలు తీసుకోకపోవటం కూడా హానికరమే. కనుక మన నియమిత ఆహారంలో కొవ్వు పదార్థం కూడా తీసుకోవాలి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు.

 మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో హెచ్చుగా విటమిన్స్ లభ్యమవుతాయి. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. తాజా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. టొమోటాలు, దోసకాయ, పాల కూర మొదలయిన వాటిలో హెచ్చుగా కాల్షియం ఉంటుంది. ఐరన్ ఉంటుంది. కెరోటిన్, రిబోఫ్లోవిన్, విటమిన్ 'సి' ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది. 

తాజాపండ్లు ఆరంజ్,  ఆపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యుస్ కూడా మంచిదే. అందులో విటమిన్ 'సి' ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలని అనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. ఎక్కువగా కాఫీ, టీ తాగకూడదు. చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం ఎక్కువగా తీసుకోరాదు.నీరు పుష్కలంగా తాగాలి. పైన చెప్పుకున్న  ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా, అందం సొంతం చేసుకోవచ్చు.

                                         ◆నిశ్శబ్ద.