Read more!

సమైక్యతా స్వరపు ఉక్కు సంకల్పం!

చిన్నప్పుడు ఆవు, పులి కథ పాఠంగా ఉండేది. మూడు ఆవులు కలసి మెలసి ఉండేవి. అవి ఎప్పుడూ కలని తిరిగేవి. కలిసి పచ్చిక మేయడానికి వెళ్ళేవి. అవి అలా కలసి ఉండటంతో వాటి దగ్గరకు వస్తున్న పులిని వాటి కొమ్ముల సహాయంతో తరిమి కొట్టేవి. కానీ ఆ ఆవుల మధ్య గొడవలు వచ్చాయి, ఒకదానికొకటి మాట్లాడుకోవడం మానేసాయి. అది గమనించిన పులి ఒక్కొక్క ఆవును చంపి తినడం మొదలుపెట్టింది. చివరికి ఆ ఆవులను అన్నిటినీ చంపి తినేసింది. ఆవులు కలసి ఉన్నప్పుడు వాటిని ఏమి చేయలేని పులి అవి విడిపోగానే వాటిని చంపేసింది. అంటే కలసి ఉన్నప్పుడు ఆవుల బలం ఎక్కువ, కానీ విడిపోగానే పులి బలం ఎక్కువయ్యింది. 

ఇదే విధంగానే ఇంకొక కథ ఉండేది. ఒక తండ్రి తన కొడుకులు ఆస్తి పంచుకుని విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని బాధపడి వాళ్ళను పిలిచి  ఒక్కొక్కరికి ఒకో కర్ర ముక్క ఇచ్చి దాన్ని విరచమని చెబుతాడు. వారు ఎంతో సులభంగా విరిచేస్తారు. ఆ తరువాత కట్ట కఱ్ఱముక్కలు ఇచ్చి విరచమంటే విరచలేరు. కారణం కలసికట్టుగా ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ రెండు కథలు అందరికీ తెలియజేసేది ఒకటే…. ఐకమత్యంగా ఉంటేనే అది గొప్ప శక్తిగా అవుతుంది అని. 

జాతీయ సమైక్య దినోత్సవం వెనుక కూడా ఇలాంటి కారణమే ఉంది. భారత మొదటి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారు. 

వల్లభాయ్ పటేల్ జయంతికి సమైక్యతా దినోత్సవానికి లింకేంటి??

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన వల్లభాయ్ పటేల్ లో న్యాయకత్వ నైపుణ్యాలు చాలా ఎక్కువ. ఈయన దేశాన్ని నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ముఖ్యంగా స్వాతంత్య్రం తరువాత 1947 సంవత్సరంలో జరిగిన భారత్- పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి సమర్థమంతమైన వ్యూహాన్ని అందించినవాడు ఈయన. ఈయనలో ఉన్న నైపుణ్యం ఫలితంగా ఈయనను "సర్దార్" అనే పేరుతో పిలుచుకుంటారు.

ఇది మాత్రమే కాకుండా ఐక్యతలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించిన ఈయన బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన తరువాత 

అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో చేరేలా చేయడంలో  చేసిన కృషి మరచిపోలేనిది. ఇది భారతదేశం మొత్తం ఐక్య దేశంగా అవతరించడానికి మూలకారణం అయ్యింది.  

ఒకటా రెండా బ్రిటీష్ ఆధిపత్యం నుండి విడుదలైన 565 స్వయం పాలక సంస్థానాలలో దాదాపు ప్రతి ఒక్కటి భారత యూనియన్‌లో చేరడానికి ఒప్పించిన అద్భుతమైన నైపుణ్యం  ఈయనదే…. ఇంతటి అసాధ్య పనిని సుసాధ్యం చేసినందుకు గానూ ఈయనను "భారతదేశపు ఉక్కు మనిషి" అనే బిరుదుతో ఎంతో ఆత్మీయంగా పిలుచుకుంటారు.

2014 సంవత్సరంలో అత్యంత ఎత్తైన ఉక్కు విగ్రహాన్ని ఆవిష్కరించింది మోదీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం హాయంలో ఆ సందర్భంగానే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవం లేదా  రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించారు. అప్పటినుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 తేదీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా అధికారిక ప్రకటనలో  ఏ బెదిరింపులకు లోనూ కాకుండా దేశం యొక్క స్వాభావిక బలం మరియు స్థితిస్థాపకతను పునరుద్ఘాటించే అవకాశాన్ని కల్పిస్తుంది. మన దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రత గురించి దేశం మరొక అడుగు ముందుకు వెళ్లే దిశగా ఆలోచనలు, సరికొత్త ఆచరణలు చేపడుతుంది. 

మరొక ముఖ్య విషయం ఏమిటంటే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేయబడుతుంది. దాని సారాంశం ఎలా ఉంటుందంటే….

"జాతి ఐక్యత, సమగ్రత భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తానని, నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్  దార్శనికత, ఆయన జీవించి ఉన్న కాలంలో చేపట్టిన  చర్యలు గుర్తుంచుకొని నా దేశం యొక్క అంతర్గత భద్రత విషయంలో నా స్వంత సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను" అనే ప్రతిజ్ఞ చేయబడుతుంది.

అధికారిక ఉత్తర్వుల ప్రకారం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు). మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పాటించేందుకు అక్టోబర్ 31న ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞను నిర్వహించేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇలా జాతీయ సమైక్యతా దినోత్సవం వెనుక భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అనిర్వచనీయమైనదిగా ఉంది.

                                     ◆నిశ్శబ్ద.