అనుచిత సలహాలెందుకయ్యా కోనా?
posted on Apr 12, 2024 @ 11:44AM
ఫుల్ టైమ్ సినీ రచయిత, పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు కోన వెంకట్ ఇటీవల తన సినిమా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోరకం వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్ తనపై విమర్శలు రేగడానికి తానే అవకాశం ఇచ్చారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న కోన వెంకట్ తన పనేదో తాను చేసుకోక పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నప్పుడు ఈయన గారు ‘మనకెందుకు పాలిటిక్స్’ అని పవన్ కళ్యాణ్‌కి తగుదునమ్మా అని ఉచిత సలహా ఇచ్చారట. ఇలాంటి అనుచిత సలహా ఇచ్చిన కోన వెంకట్‌కి పవన్ కళ్యాణ్ ‘నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో’ అని సమాధానం ఇచ్చారట. మరి పవన్ కళ్యాణ్ ఇంత సాఫ్ట్.గా చెప్పారో, చాలా ఘాటుగా చెబితే, వెంకట్ దాన్ని సాఫ్ట్.గా మార్చారో ఆయనకే తెలియాలి. పవన్ కళ్యాణ్ ఇంట్రావర్ట్, సెన్సిటివ్, పరుషంగా మాట్లాడడు... అందుకే ఆయనకు ఈ గొప్ప సలహా ఇచ్చానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ రకంగా ఆయన విమర్శకులకు దొరికి పోయారు.
పవన్ కళ్యాణ్‌కి కోన వెంకట్ ఎంతకాలం క్రితం సలహా ఇచ్చారోగానీ, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఇప్పటి పరిస్థితిని చూస్తే కోన సలహా ఇచ్చింది అనవసరపు సలహా అనేది అర్థమైపోతోంది కదా. సినిమాల్లో నటించడం ద్వారా వచ్చే ఎంతో ఆదాయాన్ని వదులుకుని, రాజకీయ పార్టీని స్థాపించి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అధికార వైసీపీ నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాట పంథాలో పయనిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్... అలాంటి పవన్ కళ్యాణ్, ఆనాడు కోన వెంకట్ ఇచ్చిన చచ్చుపుచ్చు సలహాని పాటించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు మిస్సయి వుండేవాడు కదా. అయినా, పవన్ కళ్యాణ్‌ని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఏ కథో చెప్పి ఇంప్రెస్ చేసుకోవాలిగానీ, ఈ రాజకీయాల ప్రస్తావన ఎందుకంట?
పవన్ కళ్యాణ్ సున్నితంగా వుంటారు కాబట్టి, సెన్సిటివ్ కాబట్టి, పరుషంగా మాట్లాడలేరు కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళకూడని కోన సలహా ఇచ్చారట. అంటే, రాజకీయాల్లో వుండాల్సింది మొరటు మనుషులే తప్ప ప్రజలకు స్ఫూర్తిగా నిలిచే మంచి మనుషులు కాదనేది కోనగారి అభిప్రాయం. అందుకే అలాంటి మొరటోళ్ళు ఇబ్బడి ముబ్బడిగా వున్న వైసీపీ సానుభూతిపరుడిగా బాపట్ల నియోజకవర్గంలో కోన హవా నడిపిస్తున్నారు.
కోన ఉచిత సలహా వెనుక వున్న మరో బలమైన కారణం ఆయన వైసీపీ అనుకూల వర్గం కావడమే. బాపట్ల నియోజకవర్గానికి కోన వెంకట్ బంధువు కోన రఘుపతి ఎమ్మెల్యే. అక్కడ కోన వెంకట్ హవా నడుస్తూ వుంటుంది. బాపట్లలో ఎక్కడ చూసిన కోన రఘుపతి కటౌట్లతోపాటు కోన వెంకట్ కటౌట్లు కూడా కనిపిస్తూ వుంటాయి. ఎమ్మెల్యే బంధువుగా కోన వెంకట్ బాపట్లలో ఏయే రాజకీయాలు చేస్తున్నారో ఆయనకే ఎరుక.
సున్నిత మనస్కులు, అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని కోన గారు అంటున్నారే, మరి ఆయన తాతగారు కోన ప్రభాకరరావు మొదట సినిమా నటుడే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గవర్నర్ స్థాయి వరకూ ఎదిగారు. ఆయన వారసత్వాన్ని అందుకునే కదా కోన రఘుపతిగానీ, కోన వెంకట్ గానీ బాపట్ల ప్రజల మీద తమ పెత్తనం చెలాయిస్తున్నది? మరి కోన ప్రభాకరరావు కూడా సున్నిత హృదయుడే, పరుషంగా మాట్లాడ్డం రానివ్యక్తే. మరి ఆయన రాజకీయాల్లో రాణించలేదా? ఆయన వారసులుగా వున్న ‘కోన’ అండ్ కో మాత్రం పెద్దాయన బాటని వదిలేసి పరుషంగా మాట్లాడే దారిలో, పార్టీలో కొనసాగుతున్నారు.
ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో అధికార వైసీపీకి చెల్లుచీటీ ఫిక్సయిపోయింది. పాపం కోన ప్రస్తుతం ఆ ఫస్ట్రేషన్లో వున్నట్టున్నారు. అందుకే, ఎప్పుడో పవన్ కళ్యాణ్‌కి, తనకి మధ్య జరిగిన సంభాషణని అనువుగాని వేదిక మీద ప్రస్తావించారు. అలా ప్రస్తావించినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.