రిజర్వ్ బ్యాంక్ రాజధాని రాజకీయం
posted on Apr 12, 2024 @ 11:55AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ చిత్రవిచిత్ర ఆటల సంగతి అటుంచితే, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాలు కూడా అమరావతి విషయంలో తమవంతు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో వుండగా జరిగిన అమరావతి అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ కుట్రల కారణంగా ఆగిపోయింది. అమ్మ పెట్టా పెట్టదు
అడుక్కుతినానివ్వదు అన్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పట్టించుకోదు.. అటు కేంద్రానికి చెందిన సంస్థలకు సహకరించదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల కారణంగా కేంద్రం నుంచి అమరావతికి అందాల్సిన ఎన్నో ప్రయోజనాలు ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సాకు చూపిస్తూ అమరావతిని అణిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ‘క్లారిటీ లేదు’ అనే సాకు చూపించి ముఖం చాటేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆ లిస్టులో తాజాగా రిజర్వ్ బ్యాంక్ కూడా చేరింది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. దీని కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాలు కేటాయించింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి కూడా అంత స్థలం వుందో లేదో మరి. తెలుగుదేశం ప్రభుత్వం స్థలం కేటాయించినా ఆర్బీఐ అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా నిద్రపోయింది. పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయి వైసీపీ పాపకాలం ప్రారంభమైన తర్వాత నిద్ర మేలుకున్న ఆర్బీఐకి పాపం రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించలేక చేతులెత్తేసింది.
అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు మహాప్రభో అని అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం ఆర్బీఐని సూదితో గుచ్చింది. ఉలిక్కలిపడి నిద్ర లేచిన ఆర్బీఐ, తమకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని లేఖ రాసింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేదని రిజర్వ్ బ్యాంక్ అనడం అమాయకత్వం అనాలో, అజ్ఞానం అనాలో అర్థం కాని పరిస్థితి.
ప్రధానమంత్రి మోడీ రాజధానిగా శంకుస్థాపన చేసింది అమరావతికి. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది రాజధాని అమరావతి అనే. కేంద్రప్రభుత్వం లెక్క ప్రకారం ఇప్పటి వరకు అయితే అమరావతే రాజధాని. ఈ ఏడాది జూన్ వరకు హైదరాబాద్ కూడా రాజధాని అయిప్పటికీ ఆ తర్వాత రాజధాని అమరావతే అనే విషయంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ పటంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే వుంది. ఇన్ని అధికారిక ఆధారాలు వుండగా, మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అనవసరపు రచ్చని ఎందుకు ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటున్నదనేది అర్థం కాని విషయం.