మహా సభకు బీజేపీ పెద్దలు డుమ్మా.. అమిత్‌షా చెప్పినా మారరా?
posted on Dec 17, 2021 @ 3:19PM
అమిత్‌షా మొన్ననే మొట్టికాయలు వేశారు. తలబొప్పి కట్టినా తీరు మాత్రం మారట్లేదు. ఏపీ రాజధాని అమరావతినే అని స్వయాగా షా నే సెలవిచ్చారు. రైతుల పక్షాన పోరాడాలని.. పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశించి వెళ్లారు. పనిలో పనిగా బీజేపీ తరఫున అమరావతి కోసం గట్టిగా ఉద్యమించాలని కూడా దిశానిర్దేశం చేశారు. అంతగా చెబితే.. ఇంత క్లియర్‌గా స్పష్టం చేస్తే.. ఏపీ బీజేపీ పెద్దల్లో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా అధ్యక్షులు సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలాంటి వారు మరీ మొండికేస్తున్నారు. మొక్కబడిగా ఓసారి పాదయాత్రలో పాల్గొని మమ అనిపించారు. మళ్లీ ముఖం చాటేశారు. తాజాగా, తిరుపతిలో అమరావతి రైతుల మహా సభకూ డుమ్మా కొట్టారు. పార్టీ తరఫున మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను పంపించి చేతులు దులుపేసుకున్నారు.
సోము వీర్రాజు తీరుపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. ఆయన బీజేపీని వైసీపీ-2 గా మార్చేశారని అంటారు. స్టేట్ ఇంఛార్జ్ సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్‌తో పాటు వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలు కలిసి.. పార్టీని భ్రష్టు పట్టించేశారని బీజేపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఆ నలుగురు అధికార పార్టీపై బాణం గురిపెట్టకుండా.. పదే పదే ప్రతిపక్ష టీడీపీని, చంద్రబాబుపైనే విరుచుకుపడుతుంటారు. జగన్‌రెడ్డికి సేఫ్ గార్డ్‌గా ఉంటారని అంటారు.
ఓ వైపు అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంటే.. రాజధానికి శంకుస్థాపన చేసింది మోదీనే అయితే.. ఆ అమరావతిని ఆగమాగం చేస్తూ.. మూడు రాజధానుల పేరుతో రాజకీయ కుట్ర చేస్తుంటే.. ప్రభుత్వంపై బీజేపీ పోరాడిందే లేదు. అమరావతికి రైతులకు మనసారా సంఘీభావం తెలిపిందే అరుదు. ఇన్నాళ్లేదో జరిగిపోయింది.. ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంత క్లియర్ కట్‌గా చెప్పారుగా? అమరావతిపై పోరాడాలని పార్టీ శ్రేణులను ఆదేశించారుగా? అయినా, వారిలో మార్పు రాలేదెందుకంటే అదంతా జగన్‌పై ప్రేమేనంటున్నారు. తిరుపతిలో రాజధాని రైతుల మహా సభకూ పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు హాజరుకాకపోవడం ఉద్దేశపూర్వకమే అని తప్పుబడుతున్నారు. బీజేపీ రాష్ట్ర నేతల తీరు ఇలానే ఉంటే.. ఇక ఏపీలో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమంటున్నారు. సునీల్ దియోదర్, వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలు వైసీపీ-జగన్‌తో అంటకాగుతూ.. పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని అంతా మండిపడుతున్నారు.