స్టీల్ ప్లాంట్‌పై తగ్గేదే లే.. డిజిటల్ క్యాంపెయిన్‌కు పీకే పిలుపు..
posted on Dec 17, 2021 @ 3:01PM
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని శ్రేణులను జనసేనాని ఆదేశించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యతనే రీతిలో తప్పించుకునే ధోరణిలో ఉందని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు వారి బాధ్యతను గుర్తు చేసే లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగిద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చట్టసభల్లో ప్లకార్డులు ప్రదర్శించాలనే బాధ్యత వారికి తెలిసేలా ఆంధ్రప్రదేశ్ లోక్సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలని జనసేన శ్రేణులకు ఆయన ఆదేశాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే విషయాన్ని పార్లమెంట్కు తెలియచేయాలని ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరదామని అన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయా లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని జనసేన శ్రేణులకు పవన్ సూచించారు.
ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడమే ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని పవన్ కళ్యాణ్ వివరించారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గళం విప్పకుండా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బాధ్యత గుర్తు చేద్దాం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించింది. జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసిరావాల్సిన సమయం ఇది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజు వరకు అలా ఏ రాజకీయ పార్టీ కలసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విభేదాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం’ అని పవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీకి అనిపించింది. వైసీపీ, టీడీపీ ఎంపీలకు జనసేన నుంచి ఇదే మా విన్నపం. మీరు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యత స్వీకరించి వైసీపీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు కూడా కోరాం. వారు స్పందించలేదు. వైసీపీ నాయకత్వానికి మరోసారి మా విన్నపం. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మీతో కలిసి నడవడానికి మేం సిద్ధం. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. మన రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం’ అని పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు.
జనసేన పక్షాన మా వంతు బాధ్యతగా మేం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించవద్దు అనే నినాదం ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తాం. కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు మేం మర్చిపోం. తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. అదే బాధ్యతను గుర్తు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతున్నాం. వైసీపీ ఎంపీలు ముందుండి పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ఎన్నో త్యాగాలతో వచ్చిన ఉక్కు పరిశ్రమ కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో పునరాలోచన చేయాలనే విషయం కేంద్రానికి తెలియచెప్పాలి. ఆ కార్యక్రమాన్ని వైసీపీ ఎంపీలు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.