హుజురాబాద్ గప్‌చుప్.. అంతుచిక్కని ఓటర్.. అభ్యర్థుల్లో గుబుల్..
posted on Oct 12, 2021 @ 1:24PM
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థులకు హైటెన్షన్. ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ. ప్రచార సమయంలో ఓటరు నాడిపై కాస్త క్లారిటీ వచ్చేస్తుంది. పోలింగ్ నాటికి గెలుపోటములు తెలిసిపోతాయి. ఇక హోరాహోరీగా ఎన్నిక సాగే చోట.. నరాలు తెగే టెన్షన్ తప్పదు. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ హుజురాబాద్‌లో నెలకొంది. ఈటల రాజేందర్‌కు చావోరేవో తేల్చేసే పోరు ఇది. కేసీఆర్ ఆధిపత్యాన్ని ధిక్కరించే యుద్ధం ఇది. ఈటల గెలిస్తే.. ప్రగతిభవన్‌కు బీటలు తప్పకపోవచ్చు. అందుకే, రాజేందర్‌ను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు శాయశక్తులా ట్రై చేస్తున్నారు కేసీఆర్. ఆయన కోసం కాదంటున్నా.. దళితబంధుతో హుజురాబాద్ ఓటర్లకు ఎర వేశారు. మంత్రి హరీశ్‌రావు ఆధ్యర్యంలో డజన్ల కొద్దీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను మోహరించి.. ఈటల ఓటమికి పట్టుదలగా పోరాడుతున్నారు. మధ్యలో కాంగ్రెస్ ఉన్నా.. మెయిన్ బుల్ ఫైట్ మాత్రం ఈటల వర్సెస్ కేసీఆర్ మాత్రమే.
మరి, హుజురాబాద్‌లో గెలుపెవరిది? ఉప ఎన్నికల్లో గెలిచి నిలిచేదెవరు? ఇదే హాట్ టాపిక్. మరో రెండు వారాల్లో ప్రచారం ముగిసిపోనుంది. అయినా, ప్రజల నాడి అంత ఈజీగా దొరకడం లేదు. దశాబ్దాలుగా ఏలుతూ వచ్చిన ఈటల రాజేందర్ వైపే ఓటర్లు నిలుస్తారా? గులాబీ పాలనకు జై కొడతారా? ఓ పట్టాన అర్థం కావడం లేదంటున్నారు. ఇక, ఆసక్తికర విషయం ఏంటంటే.. మీరు ఎవరికి ఓటేస్తారని హుజురాబాద్ ప్రజలను అడిగితే.. వారి నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. హుజురాబాద్ ఓటర్లు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టున్నారు. ఎవరికి ఓటేసేది ఓ పట్టాన చెప్పడం లేదు. పార్టీలు, అభ్యర్థుల కార్యకర్తలు, అనుచరులు మాత్రం తమ నాయకుడే గెలుస్తారని, తమ పార్టీదే విజయమని చెబుతున్నా.. సాధారణ ప్రజలు మాత్రం ఎవరికి ఓటేసేది అస్సలు బయటపెట్టడం లేదు. అందుకే, సర్వేలు సైతం ఫలితం ఇలా ఉండబోతోందంటూ స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. హుజురాబాద్‌లో పీపుల్స్ పల్స్ పట్టడం కష్ట సాధ్యమవుతోంది.
ఓటరు నాడి తెలిస్తేనే.. పార్టీలు, నాయకులు వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంటుంది. ఫలానా ఏరియాలో.. ఫలానా కేండిడేట్‌కు బలం ఉందని తెలిస్తే.. ప్రత్యర్థులు ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ప్రాంతం ఏ పార్టీకి అనుకూలంగా ఉందో.. ఏ వర్గం ఎవరికి మద్దతుగా ఓటేయబోతున్నారో.. తేలడం లేదు. బహుషా ఓటర్లు సైతం ఇంకా తేల్చుకోలేకపోతున్నారేమో. ఇటు అభిమాన నాయకుడు ఈటల రాజేందర్.. అటు రైతు బంధు కేసీఆర్.. ఇద్దరిలో ఎవరికి ఓటేయాలో.. ఎవరికి పట్టం కట్టాలో.. ఓ నిర్ధిష్ట అభిప్రాయానికి రాలేకపోతున్నారట ఓటర్లు. అందుకే, హుజురాబాద్‌లో ఎవరికి ఓటేస్తారంటూ ఎవరిని అడిగినా.. ప్రజలు పెదవి విప్పడం లేదు. హుజురాబాద్ వాసులంతా గప్‌చుప్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. ఈ పరిణామంతో ప్రధాన పార్టీల్లో మరింత కలవరపాటు. పోలింగ్ నాటి వరకూ ఇదే ఉత్కంఠ కొనసాగేలా ఉంది. వారి నిర్ణయం ఈవీఎమ్‌లు ఓపెన్ చేస్తే కానీ తెలిసేలా లేదు. అప్పటి వరకూ హైటెన్షన్ తప్పేలా లేదు.