వంగవీటి హత్యకు రెక్కీ చేసిందెవరు? చంపే అవసరం ఎవరికుంది?
posted on Dec 28, 2021 @ 2:56PM
స్వర్గీయ వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కి నిర్వహించారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో మళ్లీ అలజడి రేపేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఎనభయ్యో దశకంలో బెజవాడ నగరంలో చోటు చేసుకున్న హింస, రక్తపాతం తాలుకు అనవాళ్లు.. ఇంకా ఆ నగరంలో సజీవంగానే ఉన్నాయా? అంటే.. వంగవీటి రాధా తాజా వ్యాఖ్యలతో ఉన్నాయనుకోవాల్సి వస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
వంగవీటి రంగా హత్య జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఆ తర్వాత అంటే 33 ఏళ్ల తర్వాత కూడా వంగవీటి రంగా వారసుడ్ని అంతమొందించే కార్యక్రమానికి.. అదే తరహా కుట్ర జరగుతోందా? అసలు వంగవీటి రాధాను ఎవరు హత్య చేయాలనుకున్నారు? ఎందుకు వంగవీటి రాధానే వాళ్లు టార్గెట్‌గా చేసుకున్నారు? ఇంతకీ వంగవీటి రాధాను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది? పోని వంగవీటి రంగా తనయుడు రాధాను హత్య చేసి.. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా లబ్ది పొందాలనుకోంటోందా? ఆయన్ని హత్య చేస్తే.. వారికి వచ్చే లాభమేమిటి? పోని ఆయన్ని హత్య చేసి.. ఆ హత్యను మరో పార్టీకి ఆపాదించి... లబ్ది పొందాలనే ఆలోచనలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా?
అంటే సందేహామే, పోని అదే నిజమనుకుందాం? వంగవీటి రాధా హత్య తర్వాత చోటు చేసుకునే పరిణామాలు.. వాటిని తట్టుకుని సదరు పార్టీతోపాటు ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్య నిలబడగలరా? ఓ వేళ అనాటి పరిస్థితులు అంటే 1988 నాటి పరిస్థితులు పునరావృతమైతే.. పరిస్థితి ఏమిటీ? వంగవీటి రాధాను హత్య చేసి.. ఆ హత్యను ఓ పార్టీకి పూసి.. ఆయన సామాజిక వర్గం తాలుక ఓట్లు పొందే ప్రయత్నానికి ఏ పార్టీ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? లేక రాష్ట్రంలోని ఓ పార్టీలో ఎదుగుతోన్న నాయకుడు.. వంగవీటి రాధాను హత్య చేయించి.. భవిష్యత్తులో తాను రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం కోసం ఇలాంటి తరహా ప్రయత్నం ఏమైనా చేయిస్తున్నాడా? లేక వంగవీటి రాధాను హత్య చేసి.. ఆ సాకుగా ఎరగా చూపి.. ప్రభుత్వాన్ని అస్థిర పరిస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే తలంపు ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా ఉందా?.. లేక అధికారం పార్టీలోని పెద్దలే ఈ తరహా రాజకీయానికి ప్రయత్నిస్తున్నారా? ఆ క్రమంలో వంగవీటి రాధా హత్యకు ఏ రాజకీయ పార్టీ అయినా పథక రచనకు శ్రీకారం చుట్టిందా? అనే ప్రశ్నలతోపాటు సందేహాలు సైతం ఉత్పన్నమవుతున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
అసలు వంగవీటి రాధాకు.. వంగవీటి మోహన రంగా తనయుడిగా మంచి పేరే ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందింది కూడా ఒక్కసారే. అదీ 2004 ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికల్లో పోటీనే చేయలేదు. కానీ 2024లో జరగనున్న ఎన్నికల్లో మాత్రం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రాధాను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు.
ఇక వంగవీటి రాధా స్వతహాగా ఎక్కువగా బయటకు రారు... ఓ వేళ ఆయన బయటకు వచ్చినా తన పని ఏదో తాను చేసుకుని కామ్‌గా వెళ్లిపోతారు. అంతేకానీ రాజకీయాలు, దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు.. వగైరా వగైరా లాంటివి వంగవీటి రాధా ఒంటికి సరిపడవన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ వ్యవహారాల్లో ఆయన అనుచరులను సైతం తలదూర్చనివ్వరన్నది విజయవాడ నగర ప్రజలందరికీ తెలిసిందే.
అలాగే సభలు, సమావేశాల్లో సైతం వంగవీటి రాధా అంత ఎక్కువగా పాల్గొనరని ఆయన అనుచరులే చెబుతారు. అయితే ఆయన తండ్రి వంగవీటి రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో మాత్రం వంగవీటి రాధా పాల్గొన్న.. నాలుగు మాటలు మాట్లాడతారే తప్పా.. పొలిటికల్ మైలేజ్ కోసం ఆ పార్టీ మీద, ఈ పార్టీ మీద నాలుగు రాళ్లు వేద్దామనే యావ ఆయనకు ఏమాత్రం లేదన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునని ఆయన అనుచరులే పేర్కొంటారు. అలాంటి వంగవీటి రాధా.. తాజాగా తన తండ్రి వర్ధంతి రోజే.. తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. అదీకూడా రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.
పోనీ ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి.. అసలు ఏం జరిగింది.. రెక్కీ ఎప్పుడు జరిగిందంటూ సదరు సభలోనే వంగవీటి రాధాను ఆరా తీశారా? అంటే అదీ లేదు. పోనీ వంగవీటి రాధాను మనం రక్షించుకోవాలంటూ ప్రజలుకు వీరిద్దరు ఏమైనా పిలుపు నిచ్చారా? అంటే అదీ కూడా లేదు. మరి వంగవీటి రాధా ఒక సంచలన వ్యాఖ్య చేస్తే వీరిద్దరు కనీసం స్పందించక పోవడంపై పలు సందేహాలకు తావిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం వంగవీటి రాధా తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని ఇటీవల దాదాపు 15 మంది ఆగంతకులు పలుమార్లు.. పలు సమాయాల్లో రెక్కీ నిర్వహించారని ఆయన అనుచరులే స్వయంగా చెబుతున్నారు. పోనీ వంగవీటి రాధా అయినా.. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ.. అటు డీజీపీని కానీ.. ఇటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కానీ కలిసి కనీసం ఫిర్యాదు అయినా చేశారా ? అంటే అదీ లేదు. మరి వంగవీటి రాధా చేసిన కామెంట్స్ ఏ కోణంలో ఎలా చూడాలని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. వంగవీటి రాధా చేసిన ఓ సంచలన వ్యాఖ్య... లక్ష సందేహాలు పుట్టగా ఉందంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.