2021 ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక..
posted on Dec 28, 2021 @ 2:50PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, 2021 సంవత్సరం ఒక ప్రత్యేక సంవత్సరంగా నిలిచి పోతుంది. సంవత్సరం పొడుగునా ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నికల క్రతువు నడుస్తూనే వుంది. ఎన్నికల వాతావరణమే కొనసాగింది. ఒక విధంగా ఎన్నికల సంవత్సరమా అన్నట్లుగా సంవత్సరం పొడుగునా ఏదో ఒక ఎన్నికల సందడి కొనసాగింది. అయితే, అన్నిటినీ మించి హుజూరాబాద్ ఉప ఎన్నిక. ‘పొలిటికల్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్’ అన్నట్లుగా నిలిచి పోయింది. అలాగే, అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగానూ చరిత్రను సృష్టించింది. సుమారు నాలుగైదు నెలలకు పైగా ఇంకా మాట్లాడితే, మాజీ మంత్రి ఈటల పై వేటు పడిన మే 1 తేదీ నుంచి లెక్కేసుకుంటే సగం సంవత్సరం రాష్ట్ర రాజకీయాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే ప్రరిభ్రమించాయి.చివరకు ఏమి జరిగింది అన్నది ఇప్పుడు చరిత్ర్ర. ఒక విధంగా హుజూరాబాద్’కు ముందు హుజూరాబాద్ తర్వాత, అన్నంతగా రాష్ట్ర రాజకీయాలను ఉప ఎన్నిక ప్రభావితం చేసింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ర రాజకీయాలను మలుపు తిప్పిన మరో ముఖ్య పరిణామం.. తెలంగాణ పీసీసీ చీఫ్’గా రేవంత్ రెడ్డి నియామకం. అంత వరకు స్తబ్దుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్’లో రేవంత్ జోష్ పెంచారు. ఈ ఏడాది జూలై 7న రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి.. కేడర్‌లో కదలిక తీసుకొచ్చే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లి వేదికగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మొదలు వరస కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొడితే ఏనుగు కుంభ స్థాలాన్నే కొట్టాలన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ఫ్యామిలీ టార్గెట్’గా అస్త్రాలు సందిస్తున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుగా దూసుకు పోతున్నారు. కేంద్రంతో పాటు 20 రాష్ట్రాలలో అధిఅక్రంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంటే, అక్కడా, ఇక్కడా ఎక్కడా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రేవత్ ఆధికార పార్టీ అగ్ర నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.
అయితే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నటుగా రేవంత్ రెడ్డికి ఇంటి పోరు ఎక్కువైంది. ఒకరిద్దరు తప్ప పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ రేవంత్ రెడ్డికి సహకరించడం లేదు. సహకరించక పోవడమే కాకుండా, ఆయన ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపిస్తున్నారు.రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఇంకా పూర్తిగా ఆరు నెలలు అయినా కాలేదు.కానీ, ఇంతలోనే, అధిష్టానానికి ఫిర్యాదులు మొదలయ్యాయి. ఆయన్ని అధ్యక్ష పదవినుంచి తప్పించాలని, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల పట్ల పెద్దగా శ్రద్ద చూపడంలేదు.ఈ సంవత్సర కాలంలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన రెండు మూడు సార్లు వాయిదా పడింది. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు నాగర్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉపన్నికల్లోనూ పడిపోయింది. పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్’ ఓడిపోవడమే కాదు డిపాజిట్ కుడా కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
బీజేపీ కేంద్ర నాయకత్వం అండదండలతో తెరాసకు ప్రధాని ప్రత్యర్ధిగా నిలిచేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. గత సంవత్సరం (2020)లో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలు కొనసాగింపుగా, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ బీజేపీ చేరి, ఉప ఎన్నికల్లో 20 వేల పై చిలుకకు మెజారిటీతో విజయం సాధించారు. దీంతో బీజీపీలో తెరాసకు ప్రత్యాన్మాయం తామేనన్న భరోసా బలపడింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, పాదయాత్రలు, దీక్షలతో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు.రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలం అంతత మాత్రమే అయినా, పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యెక దృష్టిని కేంద్రీకరించింది, అందుకే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు అప్పగించారు. తెలంగాణ ఏర్పడ్డాక, అంతకు ముందు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలెవరికీ ఇలా కేంద్ర కేబినెట్ హోదా లభించలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సెప్టెంబర్ 17 పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిని బట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళుతోంది.
ఇక అధికార తెరాస విషయానికి వస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఒకట్రెండు ఎదురుదెబ్బలు తగిలినా అధికార టీఆర్‌ఎస్ హవా కొనసాగుతూనే వచ్చింది. అయితే,హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శక్తి యుక్తులు అన్నీ ఉపయోగించి పోరాడి ఓడిన తర్వాతా, పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈనేపధ్యంలోనే ముఖ్యమంత్రి వ్యూహంమార్చి, ఓ వంక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఫై దృష్టి పెట్టారు, మరో వంక, బీజేపీని డిఫెన్సులో పడేసేందుకు కేంద్రంఫై కత్తులు దూస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పై అంచెల వారీగా పోరు సాగిస్తున్నారు. నవంబర్ 1న మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్‌ఎస్ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 20న ఊరూరా చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా, రాష్ట్ర బీజేపీ టార్గెట్’గా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో పాటుగా సెంటిమెంట్’ను మళ్ళీ మరోమారు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదలా ఉంటే మూడు ప్రధాన పార్టీలతో పాటుగా,ఈ సంవత్సరం మరో రెండు పార్టీలు, ఇద్దరు కీలక వ్యక్తులు తెలంగాణ రాజకీయ వేదిక మీదకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర మజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహాన్ రెడ్డి సోదరి షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీని స్థాపించారు. పార్టీని ప్రారంభించినప్పటి నుంచీ ఆమె ప్రజల్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగ దీక్షలు, పాదయాత్రలు, రైతు ఆవేదన దీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఏడెనిమిది సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకుని ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. బీఎస్పీలో చేరి దళిత వాదంతో జనంలోకి పోతున్నారు. ఇక ఇప్పటికే ఉన్న టీజేఎస్, వామపక్ష పార్టీలు, ఇతర చిన్నా చితక పార్టీలు ఉనికిని నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నాయి.