ఏపీ కేంద్రంగానే డ్రగ్స్ దందా?.. ఆ బిగ్‌బాస్ ఎవరు..?
posted on Sep 23, 2021 @ 1:50PM
గుజరాత్‌లో 9వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత. ఎక్కడో ముంద్రా పోర్టులో డ్రగ్స్ డొంక కదిలితే.. దాని లింకులు విజయవాడలో వెలుగుచూడటం ఆంధ్రప్రదేశ్‌ను షేక్ చేస్తోంది. డ్రగ్స్ దందాకు ఏపీకి అడ్డాగా మారిందా అనే విమర్శలు. ఇప్పుడు దొరికింది 9వేల కోట్ల సరుకే కానీ, అంతకుముందు అదే బెజవాడ కంపెనీ 72వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను చేతులు మార్చిందనే ఆరోపణలు. పైగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆశి ట్రేడింగ్ కంపెనీ ఓ వైసీపీ ఎమ్మెల్యే బంధువుదేనంటూ వార్తలు. మరోవైపు, కృష్ణపట్నం పోర్టు ద్వారా భారీగా డ్రగ్స్ దందా నడుస్తోందనే విమర్శలు. తాలిబాన్ టూ తాడేపల్లి.. ఈ డ్రగ్స్ దందా వెనుకున్న బిగ్‌బాస్ ఎవరో తెలుసా? అంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.. ఇలా కొన్నిరోజులుగా ఏపీని డ్రగ్స్ ఎపిసోడ్ కుదిపేస్తోంది. కేసును తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు తెలుస్తున్నాయి.
‘డ్రగ్స్ దిగుమతికి విజయవాడ చిరునామాతో రిజిస్టర్ అయిన కంపెనీని మాత్రమే వాడుకున్నారు. కానీ, ఈ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధమే లేదు’.. అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అఫ్ఘానిస్థాన్ నుంచి ఇండియాకి వచ్చిన డ్రగ్స్ ఏపీలోకి కూడా అడుగు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు ద్వారా డ్రగ్స్ బయటికి వచ్చినట్టు సమాచారం. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కేంద్ర అధికారులు టాల్కమ్ పౌడర్ ముసుగులో దిగుమతి అవుతున్న హెరాయిన్‌ను భారీ స్థాయిలో పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ ముఠా ముంద్రా పోర్టుకు మాత్రమే పరిమితం కాలేదని, కృష్ణపట్నం రేవునూ వాడేసుకుందనేది తాజా సమాచారం. ఇది కూడా విజయవాడ చిరునామాతో ‘ఆశి ట్రేడింగ్ కంపెనీ’ ఏర్పాటు చేసిన మాచవరపు సుధాకర్ ద్వారానే జరిగినట్టు తెలుస్తోంది. ముంద్రాలో దొరికిపోయినప్పటికినీ.. కృష్ణపట్నం రేవు నుంచి మాత్రం ఎవరికీ చిక్కకుండా డ్రగ్స్ బయటపడినట్టు అధికారులు అనుమానిస్తుండటం కలకలం రేపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల కోసం ముంద్రా పోర్టు ద్వారా.. దక్షిణాది కోసం కృష్ణపట్నం పోర్టును ఎంచుకుని డ్రగ్స్‌ను దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ముంద్రా పోర్టు, ఇటు కృష్ణపట్నం రేవు... ఇవి రెండూ అదానీ గ్రూప్‌నకు చెందినవే కావడం యాదృచ్ఛికమే..?
ముంద్రా పోర్టులో డ్రగ్స్ స్వాధీనం అనంతరం కేంద్ర సంస్థలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ‘‘ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, గాంధీధామ్, మాండ్వి, విజయవాడలో తనిఖీలు చేపట్టాం. కన్‌సైన్‌మెంట్ రవాణాకు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్ అందించిన లైసెన్స్ హోల్డర్ మాచవరపు సుధాకర్, ఆయన భార్యను అరెస్టు చేశాం’’ అని డీఆర్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది.
9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ విజయవాడకు సరఫరా అవుతూ పట్టుబడితే వైసీపీ సర్కారు గానీ, ఏపీ పోలీసులు గానీ ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఈ డ్రగ్స్ దందాలో కీలక నిందితుడిగా ఉన్న సుధాకర్ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు బంధువు అని, ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సహకారం లేకుండా సుధాకర్ అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ను విజయవాడకు తరలిస్తారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మాచవరపు సుధాకర్‌కు ముమ్మాటికీ వైసీపీ సర్కారు మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాలిబాన్ టూ తాడేపల్లికి ఉన్న సంబంధమేమిటో తేల్చాలి. ఈ దందాలో బిగ్ బాస్ ఎవరో తేలాలి’’ అంటూ ప్రతిపక్షం నిలదీస్తుండటం ప్రకంపణలు రేపుతోంది.