రెండు ఏళ్ల ముందే అభ్యర్థుల ప్రకటన..
posted on Sep 23, 2021 @ 2:35PM
ఎన్నికలు వచ్చాయంటే టికెట్ల కోసం పార్టీల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. పార్టీ అధినేతలు ఎంతగా కసరత్తు చేసినా కొన్నిసార్లు అభ్యర్థుల ఎన్నిక కొలిక్కి రాదు. అందుకే పార్టీలు చివరి రోజూ వరకూ అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉంటాయి. నామినేషన్ల గడువు ముగిసే చివరి గంటలోనూ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలున్నాయి. కాని ఓ ప్రాంతీయ పార్టీ ముఖ్య నేత మాత్రం సంచలనానికి తెర తీస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉండగానే.. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.
జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023లో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే ఆయన పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 27న 140 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి ప్రకటించారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఆయన ఎంపిక చేశారు. అందులో నుంచి ఫైనల్ చేసిన జాబితాను.. ఈనెల 27న పార్టీ నేతలతో జరిగే సమావేశంలో ఖరారు చేసి, అభ్యర్థిగా ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.
అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే అసమ్మతి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారంపైనా కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. పార్టీలో కొనసాగాలని ఎవరినీ ప్రాధేయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జేడీఎస్ లో ఉండేవారు ఉండొచ్చని, వెళ్లిపోయేవారు పోవచ్చని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని కుమారస్వామి కుండబద్దలు కొట్టారు. జేడీఎస్ ను కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని... 2023 ఎన్నికల ఫలితాల తర్వాత వీరందరూ పశ్చాత్తాప పడతారని కుమారస్వామి కామెంట్ చేశారు.
బీజేపీతో జేడీఎస్ కుమ్మక్కయిందనే వార్తలను కుమారస్వామి ఖండించారు. తమ అధినేత దేవెగౌడకు వయసు పైబడినా... ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న కుమారస్వామి నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి.