ఏపీ రాజధాని ఎక్కడ? మళ్ళీ మొదటికొచ్చిన కథ..
posted on Nov 22, 2021 @ 6:41PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజదాని తేనే తుట్టెను మరో సారి కదిల్చారు. మూడు రాజధానులపై వెనకడుగు వేస్తున్న సంకేతాలిచ్చి... చివరకు ఎటూ తేల్చకుండా, ఏపీ రాజధాని ఏదీ అంటే దిక్కులు చూసే సందిగ్ధ పరిస్థితి సృష్టించారు. వికేంద్రీకరణ తప్పదని, అదొక్కటే రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రం అని పాత కథను మళ్ళీ వినిపించారు. అయితే మూడు రాజధానుల బిల్లును ఏ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను ఆశించిన జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి మళ్ళీ అదే వికీద్రీకరణ మంత్రం జపిస్తున్నారు. ఎందుకోసం వెనకడుగు తీసి ముందడుగు వేశారు ఇలా చాలా అనుమానాలు, అనేక ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.
అదలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును దానితో పాటుగా సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టిన శాసన సభా వ్యవాహాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పదే పదే శ్రీకృష్ణ కమిటి నివేదికను ప్రస్తావించారు. అమరావతి కంటే ప్రకాశం జిల్లా దొనకొండకు కమిషన్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని ఒకటికి సార్లు ప్రస్తావించారు. అలాగే, వెనక బడిన ప్రాంతల అభివృద్ధిని రాజధానితో ముడి పెట్టి నేక్ ఉదాహరణలిచ్చారు. అమరావతి – దొనకొండ రెంటిలో దేన్నీ రాజధాని చేయాలి అంటే నా ఓటు దొనకొండకే అన్నట్లు మాట్లాడారు. బుగ్గన ప్రసంగాన్ని బిట్వీన్ ద లైన్స్ చదివితే, ప్రకాశం జిల్లా దొనకొండ – మార్టూర్ మధ్యన మరో శిలాఫలకం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
అలాగే దొనకొండను శివరామకృష్ణ కమిటి ప్రిఫర్ చేయడమే కాకుండా, రాజధానికి అవసరమైన హంగులన్నీ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంది. అలాగే, ప్రస్తుతం వినుకొండ నుంచి విజయవాడకు మరో రైలు మార్గం నిర్మాణంలో ఉంది. అలాగే, కేంద్ర రైల్వే శాఖ, ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని అంటున్నారు.అలాగే, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్ పోర్ట్ ఒకటి సిద్డంగా ఉంది.. నాగార్జున సాగర్ నీరు పిలిస్తే పలికేందుకు రెడీగ ఉందని, ఈ అన్నిటినీ మించి దొనకొండ – మార్టూర్ మధ్యలో ప్రభుత్వ భూమే పుష్కలంగా ఉంది.. ఒక వేళ అంతో ఇంతో కొనవలసి వచ్చినా రాష్ట్రం మొత్తం మీద అత్యంత చౌకగా భూమి లభించేది ఇక్కడే..అంటున్నారు.అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ... ముఖ్యనేత ఒక్కరే,ఆప్రాంతంలో ఎప్పుడోనే ఏదో అలా పడుతుందని జస్ట్ ఓ 15 వేల ఎకరాలు భూమి కొని పడేశారు. అలాగే, అస్మదీయులు కూడా ఎవరి శక్తి కొలది వారు ... 2014 కు ముందే పదులు లేదా వందల ఎకరాల్లో భూములు కొని పెట్టుకున్నారు..ట. సో.. బుగ్గన వ్యక్తపరిచిన అభిప్రాయాలను, అందుకు సప్లమెంట్’గా అధికార పార్టీ వర్గాల నుంచి దొనకొండకు జై కొడుతూ వినవస్తున్న అనుకూల వాదనలను పరిగణలోకి తీసుకుంటే, అమరావతికి రెక్కలు రావడం, రాజధాని దొంకొండకు చేరడం ఇంచుమించుగా ఖరారు అయిందనే అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, శివరామకృష్ణ కమిటి నివేదికను ప్రస్తావించడమే కాకుండా, ‘శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాదు,, అమరావతి ప్రాంతంలో కనీస వసతుల కల్పనకే లక్ష కోట్లు అవుతుంది. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు 6 లక్షల కోట్లు అవుతుంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల కోట్లు కనీస వసతులకు వెచ్చించాల్సి ఉందని అన్నారు. అటు బుగ్గన ఇటు సీఎం మళ్ళీ మూలాలలోకి వెళ్ళడంతో, అసలు ప్రభుత్వం ఆలోచన ఏమిటి? రాజధాని ఇష్యూ ని మళ్ళీ హరికథ కాలక్షేపంలో ‘రెడ్డొచ్చె మొదలెట్టు’ అన్నట్లు, అమరావతి కథ మళ్ళీ మొదటికి వస్తుందా? అమరావతికి మొత్తానికే ఎసరు పెడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరోవంక ముఖ్యమంత్రి మొగ్గుచూపుతున్నవిశాఖపట్నం,విషయంలోనూ శ్రీ కృష్ణ కమిటి సానుకూలంగా నివేదిక ఇవ్వలేదని, అమరావతిని కాదన్నట్లే విశాఖనూ వద్దందని నివేదిక లోతుగా అధ్యయనం చేసిన నిపుణులు అంటున్నారు నిజానికి,శివరామకృష్ణ కమిటి విశాఖ రాజధాని కాకుండా చూడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజస్కందాలపై ఉంచిందని, నిపుణులు అంటున్నారు. నిజానికి అదొక్కటే కాదు, స్థానిక ప్రజలు, ముఖ్యంగా నగర జనాభాలో 60 శాతం వరకు ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు, వ్యాపార వర్గాలు విశాఖపట్నం రాజధాని అయితే, రాజకీయ ప్రభావం ఎక్కువ అవుతుంది భయపడుతున్నారు.అంతేకాకుండా, విశాఖలో ఉన్నకేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, విశాఖను రాజధాని చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నిజానికి అప్పట్లోనే విశాఖ పోర్ట్ ట్రస్ట్ శివరామకృష్ణ కమిటికి, విశాఖను రాజదానిగా సిఫార్సు చేయవద్దని లిఖిత్ పూర్వకంగా కోరింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ విషయంలో అంత సానుకూలంగా లేదని సమాచారం సో.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశించినా ఇంకొరు వద్దనుకున్నా విశాఖకు రాజధాని యోగం లేదు గాకలేదని లోగుట్టు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం.
సో.. ఇటు అమరావతి అటు విశాఖ కాదనుకున్నప్పుడు..చివరాకు 2014కు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే, దొనకొండ రాజదాని అవుతుందని జరిగిన ప్రచారమే నిజమవుతుందని అంటున్నారు. రేపటి సంగతి ఎలా ఉన్నా.. ఈరోజు ఏపీ రాజధాని.. త్రిశంకు నగరమే..