జగన్‌రెడ్డికి అంత సీన్ లేదా? ఇదంతా కేసీఆర్ వ్యూహమా?
posted on Nov 22, 2021 @ 6:41PM
ఆదివారం ఏపీ సీఎం జగన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌లు కలిశారు. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కీలక రాజకీయ అంశాలపై చర్చించారు. ఇన్నాళ్లూ జల జగడంతో శత్రువులుగా కత్తులు దూసి.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను రాజేసిన ఆ ఇద్దరు.. ఆదివారం అలా ముచ్చట పెట్టుకోవడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందని అనుమానించారు. కట్‌చేస్తే.. సోమవారం ఉదయం నుంచీ ఏపీలో బ్రేకింగ్ న్యూస్. ప్రజలను షాక్‌కు గురి చేసే కేపిటల్ న్యూస్. కేసీఆర్‌ను జగన్ కలిసొచ్చి 24 గంటలు గడవక ముందే.. ఏపీలో ఇలా అనూహ్య పరిణామాలు జరగడం.. ఇంతకు ముందెప్పుడూ లేనట్టు.. ప్రజలెవరూ వూహించని విధంగా మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్టే తగ్గి.. సీఆర్‌డీఏ బిల్లును పునరుద్దరించి.. మళ్లీ బలంగా ముందుకొస్తామని చెప్పడం.. అంతా రాజకీయ వ్యూహంలో భాగమేనంటున్నారు. ఆ వ్యూహాన్ని అమలు చేసింది జగనే అయినా.. ఆ వ్యూహాన్ని రచించింది మాత్రం కేసీఆరే అంటున్నారు.
లేదంటే.. 700 రోజులుగా అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా.. అణువంతైనా వెనక్కి తగ్గని జగన్‌రెడ్డిలో సడెన్‌గా ఇలాంటి మార్పును ఎవరైనా ఊహించారా? ఎలాంటి ముందస్తు లీకులు లేకుండా.. ఉదయానికల్లా అంత పెద్ద నిర్ణయం ఎలా జరిగుంటుందంటారు? జగన్‌రెడ్డికి దూకుడు ఎక్కువే అయినా.. ఈ స్థాయి వ్యూహాలు ఆయన వల్ల కావని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఇదంతా మాయల మరాఠీ, తెలంగాణ చాణక్యుడు కేసీఆర్ చలవే అని చెబుతున్నారు.
"మోదీ లాంటోడే మూడు వ్యవసాయ బిల్లులపై మెడలు వచ్చిండు.. రైతులకు సారీ చెప్పిండు.. నువ్వెంత? నీ రాజకీయ అనుభవమెంత? నేను చెబుతున్నాగా.. నా మాట విను.. నీకు తెలీకుండా నేను ఏపీలో సీక్రెట్‌గా సర్వే చేయించా. ప్రజలు నీపై ఫుల్ గుస్సాతో ఉండ్రు. మూడు రాజధానుల నిర్ణయమే నీకు పెద్ద మైనస్. అది అమలు చేయడం కూడా అంత ఈజీ గాదు. కోర్టు ఎలాగైనా కొట్టేస్తది. అది నిలిచేది కాదు.. పాడూ గాదు. నా మాట విను. నే చెప్పినట్టు చెయ్. మోదీలా.. ముందు నువ్వు తగ్గినట్టు చెయ్. జనాన్ని కూల్ చెయ్. అసలే చంద్రబాబు-భువనేశ్వరి మేటర్‌లో ప్రజలు నిన్ను నిలదీస్తుండ్రు. ఛీ కొడుతుండ్రు. అది మరింత పెరిగితే అసలుకే ఎసరు. నే జెప్తున్నాగా.. చంద్రబాబు టాపిక్ ఇప్పటికిప్పుడు పక్కకు పోవాలన్నా.. అమరావతి మంట కాసింతైనా తగ్గాలన్నా.. ముందు మోదీలా నువ్వో మెట్టు దిగు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. కావాలంటే మళ్లెప్పుడైనా.. పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్లీ మూడు రాజధానుల బిల్లును బయటకు తీసుకురా. అందాకా.. అది వెనక్కి తీసుకో. నా మాట విను. నన్ను నమ్ము. నీకంతా మంచే అయితది. నేను కూడా హుజురాబాద్ ఓటమి, దళిత బంధు అమలు విషయాలను మరుగున పర్చడానికి బీజేపీపై, కేంద్రంపై ఫైట్ జేస్తున్నా. పెట్రో ధరలు, వరి కొనుగోళ్లపై దీక్ష చేశా. ఢిల్లీలోనూ ధర్నా చేస్తా. నువ్వుకుడా భువనేశ్వరి టాపిక్ డైవర్ట్ జేసేందుకు రాజధాని తేనెతట్టు కదిలియ్." అంటూ సీఎం కేసీఆర్.. జగన్‌రెడ్డికి తనదైన స్టైల్‌లో బ్రెయిన్ వాష్ చేశారని ఆ పెళ్లికి వెళ్లిన కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు చెబుతున్న రహస్య సమాచారం.
కేసీఆర్ మాటలు తెగ నచ్చేసిన జగన్.. ఆయన ట్రాప్‌లో పడిపోయారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తిరుగొచ్చి.. ప్యాలెస్‌లో నైట్ అంతా ఆలోచించి.. అర్థరాత్రి జీసస్‌తో, దివంగత వైఎస్సార్‌తో చర్చించి.. ఉదయానికల్లా మూడు రాజధానులపై వెనక్కి తగ్గే నిర్ణయం బయటపెట్టేశారని అంటున్నారు. అయినా, తాను రైతులకు భయపడినట్టు, పాదయాత్రకు తోకముడిచి వెనక్కి తగ్గినట్టు అనిపించకుండా.. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో.. మళ్లీ మూడు రాజధానులపై కొత్త బిల్లు తీసుకొస్తామంటూ బిల్డప్‌గా ప్రకటించి.. తన పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదంతా, హైలెవెల్ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న నడుస్తున్న టాక్.