ఓటమి భయంతోనే జగన్ కొత్త నాటకం!
posted on Nov 22, 2021 @ 7:56PM
మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ వెనక్కి తీసుకోవడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని అన్నారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని కేసులపై హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని జనసేనాని ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని పరిస్థితి ఉండటం దారుణమన్నారు పవన్ కల్యాణ్. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందనే భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని నిప్పులు చెరిగారు. 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే జగన్ మరిచారని అన్నారు.
రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారని… మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని నిప్పులు చెరిగారు. ఉద్యమంలో ఉన్న ఎస్సీలపై ఎస్సీలతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.