పనిలేని హీరోలు.. పనికిమాలిన ఛాలెంజ్ లు
posted on Apr 25, 2020 @ 5:04PM
రాజుగారు ఆయన వీపు ఆయన గోక్కున్నా భటులకు గొప్పే అన్నట్టుంది ప్రస్తుతం మన సెలెబ్రిటీల 'Be the real man' ఛాలెంజ్. 'మా హీరో అంట్లు తోమాడు, అసలు మా వాడు రియల్ హీరో అంటే' అని కొందరు తెగ మురిసిపోతున్నారు. అబ్బబ్బ ఆ డైరెక్టర్ ఇల్లు ఊడ్చాడు, అబ్బబ్బ ఆ హీరో దోసె వేశాడు, అబ్బబ్బ ఆ హీరో మొక్కలకు నీళ్లు పోశాడు. వీళ్ళు రియల్ హీరోస్ అంటే అని కొందరు ఓ భజన చేసేస్తున్నారు. ఏ? ఇలా ఇంట్లో పనులు ఎవరూ చేసుకోవట్లేదా?.. సెలబ్రిటీలు ఏమన్నా స్వర్గం నుండి ఊడిపడ్డారా ఏంటి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా మనకి వింతేనా?.. కొన్నిరోజులైతే మా హీరోకి తుమ్మొస్తే ఆయన చేతిని ఆయనే అడ్డుపెట్టుకున్నాడు అని కూడా మురిసిపోయేలా ఉన్నారు. అసలిలా సెలబ్రిటీలు వాళ్ళింట్లో పని వాళ్ళు చేస్తూ వీడియోలు పెట్టడం వలన సమాజానికి ఒరిగేదేంటి? పైసా కూడా ఉపయోగం లేదు. షూటింగ్ లు లేక ఇంట్లో ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు.. ఇలా ఛాలెంజ్ లు, చీపురుకట్టలు అంటూ మనల్ని పిచ్చోళ్లను చేసి సొమ్ము చేసుకుంటున్నారు అంతే.
ఈ రోజుల్లో దాదాపు సెలబ్రిటీలు అందరూ ఫేస్ బుక్ అని, ఇంస్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. వాటికితోడు సొంతంగా యూట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. ఇంకేముంది తుమ్మినా దగ్గినా వీడియో చేస్తున్నారు. మనం ఎగబడి వీడియోలు చూస్తూ వాళ్ళ జేబులు నింపుతున్నాం. సెలబ్రిటీ లు ఏం చేసినా పబ్లిసిటీనే, ఏం చేసినా పైసలే. వీళ్ళు చేసే ఈ ఛాలెంజ్ ల వల్ల సమాజానికి పైసా కూడా ఉపయోగం లేదు. లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీల నుంచి రైతుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వారికి ఎంతమంది సెలెబ్రిటీలు అండగా నిలబడ్డారు?. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ కాసులు సంపాదించడమే తప్ప.. వారిని కోటీశ్వరులను చేసిన సమాజం కోసం ఏం చేస్తున్నారు?.
హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి కోట్లు సంపాదిస్తున్నారు. యంగ్ హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి 10-15 కోట్లు పైనే తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అయితే ఒక్కో సినిమాకి 20-30 కోట్లు పైనే తీసుకుంటున్నారు. మా సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసిందని గొప్పలు చెప్పుకుంటారు. అదంతా ఎవరి సొమ్ము?. సామాన్యులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో సినిమాలు చూసి.. వాళ్ళని ఇంతటి వారిని చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఉండేవారు అప్పట్లో సీడీలు, ఇప్పుడు ఒటిటి ప్లాట్ ఫార్మ్ లలో సినిమాలు చూస్తున్నారు. కానీ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ థియేటర్స్ లో సినిమాలు చూసి కలెక్షన్ల వర్షం కురిపించేది మాత్రం సామాన్యులే. రిక్షా తొక్కేవారు, ఆటో నడిపేవారు, కూరగాయలు అమ్మేవారు, రోజువారీ కూలీలు.. వారు కష్టపడి సంపాదించిన సొమ్ముతో థియేటర్ కెళ్ళి సినిమా చూస్తారు. మా హీరో అంటూ ఎక్కువసార్లు చూసి కలెక్షన్లు పెంచుతారు. అలా కలెక్షన్లు పెరగడం వల్లనే.. హీరోలకు, డైరెక్టర్లకు రెమ్యూనరేషన్స్ పెరిగి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి వారిని ఇంతటివారిని చేసిన సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్?. రోజువారీ కూలి లేక, కూలీలు కడుపు మాడ్చుకుంటున్నారు. పంట సరిగా పండక, పండిన పంటని కొనేవారు లేక, గిట్టుబాటు ధర లేక.. రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి బాధలు సెలెబ్రిటీలకి పట్టవా?.
ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసి, ఏదో ఘనకార్యం చేసినట్టు ఓ నిమిషం వీడియో రిలీజ్ చేసి 'Be the real man' అంటే సమాజానికి ఒరిగేది ఏముండదు. సాటి మనిషికి సాయం చేసేవాడే నిజమైన మనిషి అని తెలుసుకొని.. సామాన్యులకు సాయం చేయండి. అంతేకాని ఇలా కాసుల కోసం ఛాలెంజ్ ల పేరిట ముడ్డి మూతి కడుక్కున్న వీడియోలు పెట్టకండి. మీకు ఇప్పటికే సమాజం చాలా ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత తిరిగిఛ్చి రియల్ హీరోస్ అనిపించుకోండి. లేదంటే డమ్మీ హీరోలుగా మిగిలిపోతారు. ఇప్పటి నుంచి మనం కూడా కష్టకాలంలో సామాన్యులకు అండగా నిలిచిన సెలెబ్రిటీలనే ఆదరిద్దాం. ఇలా పైసల కోసం పబ్లిసిటీ చేసుకునే డమ్మీ హీరోలను పక్కన పెడదాం.