వస్తే ఉద్యోగులతో.. లేదంటే ఒంటరిగా.. రాజధాని తరలింపుపై జగన్ ప్లాన్ ఇదేనా?
posted on Apr 25, 2020 @ 4:48PM
ఏపీ రాజధాని అమరావతి తరలింపు విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తున్నా జగన్ ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే నెలలో కరోనా వైరస్ లాక్ డౌన్, ఇతరత్రా వ్యవహారాలతో సంబంధం లేకుండా రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదం పొందకుండా ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసే పనిలో ఏపీ సీఎంవో బిజీగా ఉంది. నెల రోజుల వ్యవధిలో విశాఖకు తరలి వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
రాజధాని తరలింపు కోసం జగన్ సర్కారు ఈ ఏడాది జనవరిలోనే రంగం సిద్దం చేసింది. రాజధాని తరలింపు కోసం కీలకమైన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా... మండలి అడ్డుకోవడంతో అవి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకుతో బిల్లులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే అనే వాదనను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే మరోసారి రాజ్యాంగ పరమైన చర్చకు తెరలేవక తప్పదు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ ఆలస్యం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకును తెరపైకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై రాజధాని తరలింపు ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.
ఒక వేళ హైకోర్టులో ప్రభుత్వ వాదన నెగ్గితే ఉద్యోగులతో కలిసి మే నెలలోనే విశాఖ తరలి వెళ్లేందుకు సీఎం జగన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలా కుదరక హైకోర్టు అభ్యంతరాలు చెప్పే పక్షంలో తాను ఒంటరిగానైనా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదికారులకు ముందస్తు సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఏదేమైనా వెళ్లడం ఖాయమన్న సంకేతాలను ప్రభుత్వ పెద్దలు అధికారులకు పంపుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.