Read more!

ఏకాగ్రతకు, ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి?

ఈమధ్య కాలంలో మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ధ్యానం. మనిషి మెల్లగా యోగ, ధ్యానం వైపుకు మళ్లుతున్నాడు. అన్ని రోజులూ అన్ని విధాల మార్గాలు ప్రయోగించి, వాళ్ళు వీళ్ళు చెప్పినవి విని ప్రయత్నం చేసి, వాటి వల్ల తనకు ఆశించిన ఫలితం కలగక మన మహర్షులు ప్రసాదించిన యోగ, ధ్యానం వైపుకు మళ్ళీ నడక మొదలు పెడుతున్నారు. అయితే ధ్యానానికి, ఏకాగ్రతకు మధ్య ఉండే సంబంధం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. 

ధ్యానం, ఏకాగ్రతలు శబ్దానికి, అర్థానికి మధ్య ఉన్న సంబంధం లాంటి సంబంధం కలవి. కాబట్టి ధ్యానం అలవడాలంటే ఏకాగ్రత పట్టుబడాలి. ఏకాగ్రత సాధించాలంటే ధ్యానం అలవాటవ్వాలి. గమనిస్తే, మనకు ఏకాగ్రత కుదిరే అంశాలన్నీ ఏదో ఒక రకంగా మన మనసుకు నచ్చేవే. అంటే ఏకాగ్రత అనేది మొదటి మెట్టు అవుతుంది. 

పాఠం ఎంత విన్నా గుర్తుండని విద్యార్థికి సినిమా పాట ఒకసారి వినగానే గుర్తుంటుంది. సినిమా పాట ఎంత విన్నా గుర్తుండని వ్యక్తికి ఆ పాటకు హీరోహీరోయిన్లు చేసే నృత్యపు కదలికలు ఒకసారి చూడగానే గుర్తుంటాయి. ఇలా, ప్రతి వ్యక్తి తనకు నచ్చిన అంశం త్వరగా గుర్తుంచుకోగలుగుతాడు. నచ్చని అంశాన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుంచుకోలేడు. ఇక్కడ ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోగలగటం అన్నది ఏకాగ్రతకు సంబంధించిన విషయం.

ఓ విద్యార్థికి గణితశాస్త్రం అంటే భయం. ఎందుకంటే, లెక్కలు అతడికి అర్థం కావు కాబట్టి, అతడు ఎప్పుడూ ఆ విషయం పట్ల ఎంతో అయిష్టతతో ఉండేవాడు. కానీ, హఠాత్తుగా ఆ విద్యార్థికి లెక్కలు నేర్చుకోవటం పట్ల శ్రద్ధ కలిగింది. తోటి తెలివైన విద్యార్థుల వెంటబడి మరీ లెక్కలు చెప్పించుకోవటం ప్రారంభించాడు. రాత్రింబవళ్ళు లెక్కలు సాధన చేయటం మొదలుపెట్టాడు. దాంతో అతడు ఆ తరగతిలో లెక్కల్లో మంచి మార్కులు సాధించటమే కాదు, భవిష్యత్తులో మంచి ఇంజినీరయ్యాడు. అయితే అతడికి హఠాత్తుగా లెక్కలపై ఆసక్తి కలగటానికి కారణం ఏంటి అనిపిస్తుంది అందరికీ… 

లెక్కల తరగతికి కొత్త టీచర్ రావటమే అందుకు కారణం. ఎందుకో ఆ టీచర్ అంటే విద్యార్థికి మక్కువ కలిగింది. అతడి మెప్పు పొందాలన్న తపన కలిగింది. మెప్పు పొందాలంటే మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలంటే, లెక్కలు రావాలి... ఇలా లెక్కలపై ఆసక్తి కలిగేందుకు టీచర్ ప్రేరణగా నిలిచాడన్నమాట. అంటే, మన మనసుకు నచ్చని విషయమైనా, ఏదో ప్రేరణ లభిస్తే. మనసు పెట్టే విషయంగా మారుతుందన్నమాట, పై ఉదాహరణలో విద్యార్థికి ప్రేరణ టీచర్ నుంచి లభించింది. ఈ ప్రేరణ వ్యక్తికి తన తల్లిదండ్రుల నుంచి లభించవచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ  నుండి లభించవచ్చు. సమాజం నుంచి లభించవచ్చు. సంస్కృతీ సంప్రదాయాల నుంచి లభించవచ్చు. మొత్తానికి ఇలా లభించిన ప్రేరణను సరైన రీతిలో ఉపయోగించుకుని పైకి ఎదగటంలోనే వ్యక్తి వ్యక్తిత్వం ప్రధానపాత్ర వహిస్తుంది. అంటే ఇక్కడ ఏకాగ్రత కావాలి అంటే ప్రేరణ కూడా ఉండాలన్నమాట.

                                      ◆నిశ్శబ్ద.