జగన్ ఢిల్లీ టూర్ అందుకేనా ?
posted on Dec 28, 2022 @ 9:41AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. బుధవారం( డిసెంబర్ 23) ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశ మవుతారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎన్ని రోజులుంటారు, ఎవరిని కలుస్తారు? అనే విషయంలో స్పష్టం లేకపోయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భారీ అజెండాతోనే ఢిల్లీ వెళ్ళారని, ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది.
రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హామీ సహా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేయాలనే అభ్యర్ధన, పోలవరం బకాయిల చెల్లింపు, అంచనా వ్యయం పెంపుతో పాటుగా ఇంకా అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అదే నిజం కాదు. ముఖ్యమంత్రి ప్రధానికి సమర్పించే వినతి పత్రంలో, ఈ అన్ని అంశాలతో పాటుగా తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ. 6,756 కోట్ల బకాయిల అంశం, మెడికల్ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ఎండీసీకి ఇనుప గనులు కేటాయింపు వంటి అంశాలు అనేకం ఉండవచ్చు
కానీ అసలు అజెండా మాత్రం అది కాదని అంటున్నారు. నిజానికి, ఈ సమస్యలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. ఇప్పట్లో పరిష్కారం అయ్యేవీ కాదు. ఈ నిజం, జగన్ రెడ్డికి తెలుసు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇదే ‘ఆవు’ కథ వినిపిస్తున్నారు. కాగా, ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన జీ 20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హాజరయ్యారు. నిజానికి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళనన్ని సార్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. (ఇంతవరకు ఆయన మొత్తంగా 22సార్లు ఢిల్లీ వెళ్ళినట్లు అస్మదీయుల సమాచారం) అయినా రాష్ట్రానికి జరిగిన మేలు ఏదైనా ఉందా అంటే, ఎఫ్ఆర్బీఎం గీత దాటి అదనపు అప్పులకు అనుమతి తెచ్చుకోవడం, అక్రమాస్తుల, కేసులు, ఇతరత్రా పాత కొత్త అవివీతి కేసుల్లో కొంత ఊరట పొందడం మినహా రాష్ట్రానికి జరిగిన మేళ్ళను వేళ్ళ మీద లెక్కించ వచ్చునని అంటున్నారు. నిజానికి వేళ్ళ మీద లెక్కించే ప్రయోజనాలు అయినా రాష్ట్రానికి జరిగాయా అంటే అదీ అనుమానమే... అనే వాళ్ళు కూడా లేక పోలేదు.
అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అసలు లక్ష్యం కాగితాల్లో కనిపించేంది కాదని మళ్ళీ పాత అజెండాతోనే ఆయన ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు. కొత్త సంవత్సరంలో అయినా సకాలంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు ఖజానాలో కాసులు లేవు. ఒక్క జీతాలు, పెన్షన్లు మాత్రమే కాదు, రానున్నమూడు నెలల వరకు సర్కార్ ఏ పని చేయాలన్నా చేతిలో చిల్లి గవ్వ ఆడే పరిస్థితి లేదు. మార్చిలో బడ్జెట్ ఆమోదం పొంది కొత్త అప్పులకు తలుపులు తెరుచుకునే వరకు సర్కార్ ఖజానా శివాలయమే అంటున్నారు అధికారులు. కేంద్రం కరుణించి అదనపు అప్పుకు అనుమతి ఇస్తేనే గానీ, పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మెయిన్ అజెండాలో ఎఫ్ఆర్బీఎం నిబంధనల తాత్కాలిక సడలింపు ప్రధానమైనదని అధికార వర్గాల సమాచారం.
అదలా ఉంచితే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నటివరకు ఒక లెక్క ఈ రోజు నుంచి ఇంకో లెక్క అన్న విధంగా రాజకీయ పరిస్థితులు మారి పోతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు దగ్గరవుతున్నాయి... మరో వంక బీజేపీ కూడా పునరాలోచనలో పడిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇంతకాలం జగన్ రెడ్డి కేంద్రానికి అనుకూలంగానే ఉంటున్నారు. సఖ్యతతోనే మెలుగుతున్నారు. అయినా, దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీ, తెలంగాణ తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్రాలపై కూడా దృష్టిని కేంద్రీకరించి, వ్యూహాలను మార్చు కుంటున్న వైనం స్పష్ఠమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట మరో మారు రాజకీయ విధేయత చూపడం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన లక్ష్యం అంటున్నారు. అలాగే, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీల మెడకు బిగిస్తున్న బాబాయ్ వివేకానంద హత్య కేసు, ఢిల్లీ లిక్కార్ స్కాంలో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డితో పాటు, ఏ2 విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల మెడలకు బిగుస్తున్న మరో ఉచ్చు నుంచి తమ వారిని కాపాడుకునేందుకు కేంద్రం శరణు కోరేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు. నిజానిజాలు ఏమైనప్పటికీ, ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.