రౌండప్ 2022.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం కన్నుమూత

అక్టోబర్ 
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
అక్టోబర్ 3.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్’ ఆరోగ్యం మరింతగా క్షీణించింది.ములాయం కుమారుడు  అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్’ అఖిలేష్ యాదవ్’ కు ఫోన్ చేసి, ములాయం ఆరోగ్య పరిస్థితిని తెలుసు కున్నారు. 
అక్టోబర్ 10..సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన    మేదాంత ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ   తుదిశ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం సేవలను కొనియాడారు. 
అక్టోబర్ 10.. శివసేన ఇరువర్గాలకు కొత్త పేర్లు కేటాయించింది ఎన్నికల సంఘం. మరోవైపు, శివసేన పార్టీ పేరు, గుర్తును ఎలక్షన్ కమిషన్ స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఆదేశాలు రద్దు చేయాలని కోరింది.
అక్టోబర్ 17.. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రశాంతంగా ముగిసింది. దేశ రాజదాని ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 63 పోలింగ్ కేంద్రాల్లో సోనియా, రాహుల్,ప్రియాంక  సహా 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  25 ఏళ్ల తర్వాత గాంధీయేతర సభ్యులు అధ్యక్ష అన్నికాల బరిలో దిగడం ఇదే తొలిసారి. ఆగస్టు 19వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 
అక్టోబర్ 19.. ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం వెలువడిన ఫలితాల్లో మల్లికార్జున ఖర్గేకు 7897 ఓట్లు రాగా శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. దీనితో  మల్లికార్జున ఖర్గే  6800  ఓట్ల మెజారిటీ సాధించారు.  137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి ఏఐసీసీ పీఠం అధిష్టించబోతున్నారు.
అక్టోబర్ 22.. దేశవ్యాప్తంగా 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ,  భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మందికి  నియామక పత్రాలను అందజేశారు.   భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింద‌ని మోడీ అన్నారు. 
అక్టోబర్ 23.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు విదేశాల నుంచి విరాళాలు వసూలు చేసందుకు  ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్  పరిధిలో ఇచ్చిన లైసెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. ఈ ఫౌండేషన్ కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నారు.2020లో కేంద్ర హోం శాఖ నియమించిన అంతర్గత కమిటీ నివేదిక ఆధారంగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్’ను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  "రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎన్నోసార్లు నిబంధనలు ఉల్లంఘించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించింది. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు అండగా నిలవడం లాంటి సేవలు అందించేందుకు 1991లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 26.. కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే ఈ రోజు  అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గేకు ఈ సందర్భంగా రాహుల్‌ పుష్పగుచ్ఛం అందించారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ పగ్గాలను చేపట్టారు.