2022 రాజకీయ ప్రస్థానంలో చెరగని మరకలు !
posted on Dec 28, 2022 6:11AM
వీడ్కోలుకు సిద్దమవుతున్న 2022 సంవత్సరంలో దేశం చాలా చాలా రాజకీయ పరిణామాలు చూసింది. అరడజనుకు పైగా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి ఎన్నికలు జరిగాయి. ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. పాతికేళ్ళలో ప్రప్రథమంగా గాంధీ కుటుంబం బయటి వ్యక్తి (ఖర్గే) కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. నాలుగేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక రాష్ట్రం ( హిమాచల్ ప్రదేశ్)లో అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర సాగిస్తున్నారు. వీటితో పాటు ఇంకా చాలా చాలా రాజకీయ పరిణామాలు 2022 సంవత్సరంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే,అసలు సంఘటనలు మహారాష్ట్రలో మూడు పార్టీల ( కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) కూటమి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎస్) ప్రభుత్వం, బీహార్ లో బీజేపీ, జేడీయు సంకీర్ణ ప్రభుత్వ పతనం 2022 రాజకీయ చరిత్రలో... మెరుపులను మరిపించే మరకలుగా మిగిలిపోయాయి.
అవును, కొన్నిసార్లు రాజకీయాల్లో ఉహాకు అందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయి. శతృ,మిత్ర సంబంధాలు తిరగ బడుతుంటాయి. ప్రజలతో, ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండానే ప్రభుత్వాలు మారుతుంటాయి. 2022లోనూ రాజకీయాల్లోనూ కొన్ని అలాంటి మెరుపుల మరకల మలుపులు ఉన్నాయి. మహరాష్ట్ర విషయాన్నేతీసుకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు అధికారం కట్ట బెట్టారు. అయితే, ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత శివసేన మిత్ర పక్షం బీజేపీని కాదని, కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టు కట్టింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ముఖ్యమంత్రిగా మూడు పార్టీల మహా వికాస్ అఘాడి (ఏమ్వీఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. కానీ ఉద్ధవ్ ఠాక్రే.. ప్రభుత్వానికి నిండా రెండేళ్ళు అయినా నిండీ నిండక ముందే, సంకీర్ణంలో ముసలం పుట్టింది. శివసేన నిట్ట నిలువునా చీలిపోయింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో జట్టు కట్టారు. షిండే ముఖ్యమంత్రిగా శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది.
అయితే, ఈ మార్పు ఏదో అలా జరిగిపోలేదు. మార్పుకు ముందు ‘మహా’ రాజకీయమే నడిచింది. హై డ్రామా చోటు చేసుకుంది. ముందుగా తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే తిరుగు బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత ఏకంగా 37 మందిని కూడగట్టారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ముంబై, గోవా, గుజరాత్, అసోంతో పాటు పలు చోట్ల క్యాంపులు కట్టారు. అనర్హత వేటు, సుప్రీం కోర్టు తీర్పు, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఇలా చాలా పరిణామాలు జరిగాయి. వారాల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరికి బీజేపీ మద్దతుతో ఈ ఏడాది జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫఢ్నవీస్ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు. కుట్రతో తమ పార్టీని చీల్చారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీని విమర్శించారు.
మహారాష్ట్రలో బీజేపీ మాజీ మిత్ర పక్షం శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించడంతో పాటుగా, శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే నిర్మాణం చేసిన హిందుత్వ భావజాలాన్ని, ఓటు బ్యాంకును చక్కగా తన వైపునకు తిప్పుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి అణిగి వొదిగి అడుగులు వేస్తున్నా, చివరాఖరుకు హిందుత్వ వాదానికి, హిందూ ఓటు బ్యాకుకు ఒకే ఒక్క హక్కుదారుగా తనను తాను మలచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అయితే మహారాష్ట్రలో అనూహ్య రీతిలో సర్కార్ రిమోట్ ను చేతిలోకి తీసుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీకి బీహార్‌లో ఎదురు దెబ్బ తగిలింది. జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి షాక్ ఇచ్చారు. మహారాష్ట్ర పరిణామల నేపథ్యంలో ముందుగా జాగ్రత్త పడిన నితీష్ కుమార్ ముందుగానే బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంవత్సరం ఆగస్టులో మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గత ( 2020) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు, బీజేపీ 74 సీట్లు, జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది. బీజేపీ, జేడీయూ కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో బీజేపీకి గుడ్ బై చెప్పారు నితీశ్. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే..కుర్చీ కోల్పోతే ..బీహార్ లో నితీష్ కుర్చీ నిలుపు కున్నారు. అయినా,,ఈ రెండు రాష్ట్రాలలో చోటు చేసుకున్న పరిణామాలు, 2022 భారత దేశ రాజకీయ ప్రస్థానంలో చెరగని మరకలు గానే మిగిలి పోయాయి.