ఫోన్ మిస్సింగ్ లోగుట్టేంటి?
posted on Nov 26, 2022 9:21AM
వరుస ఐటీ, ఈడీ అధికారుల సోదాలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకులు హడలెల్తిపోతున్నారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన సంస్థల్లో ఐటీ శాఖ సోదాల చేపట్టింది. ఆ క్రమంలో సదరు మంత్రిగారి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఐటీ సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి.. తన సెల్ ఫోన్‌ను డస్ట్ బీన్‌లో చెత్త మాటున దాచి పెట్టినట్లు సోషల్ మీడియా సాక్షిగా ఓ వార్త అయితే తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ ఘటన జరిగిన జస్ట్ 24 గంటల్లోనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన అత్యంత శక్తివంతమైన నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్.. నవంబర్ 21న పోయిందంటూ.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి .. నవంబర్ 23వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియా సాక్షిగా విజయసాయిరెడ్డిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మాయల ఫకీర్ ప్రాణాలు.. సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్లు.. ఈ విజయసాయిరెడ్డిగారి గుట్టంతా.. ఆయనగారి ఐఫోన్‌లో ఉందని ఒకరు కామెంట్ చేస్తే..
ఈ మూడున్నరేళ్లలో ఈ ఏ2 గారు చేసిన అరాచకాలకు అసలు సిసలు సాక్షి.. ఆ సెల్ ఫోనే అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ పోస్ట్ పెట్టారు. మరోకరు అయితే ఇంకొంచెం ముందుకెళ్లి ఉత్తరాంధ్రలో రుషి కొండను చెక్కినా.. మైనింగ్ కోసం పాతాళం వరకు తవ్వినా... ఏదైనా.. దేనికైనా.. విజయసాయిరెడ్డి సెల్ ఫోనే అందుకు సాక్షి అని వారు సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. ఇంకొకరు అయితే.. నేడు తెలంగాణలోని మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది... రేపు నా దాకా రాదనే గ్యారెంట్ అయితే లేదని.. ఆ క్రమంలోనే ఈ సాయిరెడ్డి..ముందుగానే తన సెల్ ఫోన్.. మాయం చేశారని మరొ నెటిజన్ తనదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సెల్ ఫోన్ మాయం వెనుక పెద్ద మతలబే ఉండి ఉంటుందని మరో నెటిజన్ సందేహంతో కామెంట్ పెట్టారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సూట్ కేసు కంపెనీలు.. వైయస్ జగన్ వ్యాపారం.. వేల కోట్ల రూపాయిల అక్రమాస్తుల ఎపిసోడ్‌కి కర్మ.. కర్త... క్రియా అంతా ఈ ఏ2 విజయసాయిరెడ్డి గారేననే చర్చ నాడే కాదు.. నేటికి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో తరుచు వినిపిస్తోందని ఓ నెటిజన్ అయితే సెటైరికల్‌గా కామెంట్ పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సైతం ఈ విజయసాయి రెడ్డి.. తన చదవిన చదువుకు మెరుగులు పెట్టి మరి... నీకు అది నాకు ఇది పథకానికి మరింత మెరుగు పెట్టారనే ఓ చర్చ సైతం.. ఫ్యాన్ పార్టీలో గుప్పు గుప్పుమంటోందని ఓ నెటిజన్... తన మార్క్ పొలిటికల్ థియరీతో అనాలసిస్ చేసేయడం విశేషం.
అయినా ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ తర్వాత స్థానంలో ఉన్న ఈ విజయసాయి సెల్ ఫోన్ మాయం కావడం నిజంగా నిజమేనా? అంతా ఫుల్ సెక్యూరిటీ.. ఆయన గారి చుట్టు మంది మార్బలం ఎప్పుడు ఉంటారు. అయినా సాయిరెడ్డిగారి సెల్ ఫోన్ ఎప్పుడు పోయింది.. ఎక్కడ పోయింది.. ఎలా పోయిందంటూ ఓ నెటిజన్ తన దేహంలో పుట్టిన సందేహాలతో సోషల్ మీడియా సాక్షిగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేశారు. మరో నెటిజన్ అయితే.. ఒక్క సెల్ ఫోన్... లక్ష సందేహాలు లాగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
ఇక మరోవైపు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ పోయిందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రతిపక్ష టీడీపీ ఆగమేఘాల మీద స్పందించింది. ఆ పార్టీలోని కీలక నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. సెల్ పోయిందా లేక.. పారేశారా లేదంటే.. విజయసాయి రెడ్డి ఫోన్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బలవంతంగా లేగాసుకున్నారా? అంటు మీడియా సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపించేశారు. అయినా విజయసాయి ఫోన్ పోయిందో లేదో కానీ.. ఆయనగారి ఒక్కగానొక్క సెల్ ఫోన్ మిస్సింగ్‌తో ఎంతో మంది అటు మీడియా సాక్షిగా ఇటు సోషల్ మీడియా సాక్షిగా తమదైన శైలిలో స్పందించడం విశేషం. ఏదీ ఏమైనా.. ఓ వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, ఐటీ శాఖలు రంగంలోకి దిగితే... పాత్రదారులు, సూత్రధారులు పని పట్టడం ఎంత సేపు అనే ఓ చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన... సాగుతోంది.