గొప్ప నేతల జాబితాలో మోడీ టాప్
posted on Nov 26, 2022 9:14AM
కీలక అంశాలలో మౌనం.. ఉద్వేగాలను రెచ్చగొట్టే విషయంలో అనర్గళ ప్రసంగాలు.. దేశంలో సమస్యలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని తీరు.. వెరసి గత ఎనిమిదేళ్ల మోడీ పాలనపై దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అదే సమయంలో ఎన్నికలలో మాత్రం బీజేపీ వరుస విజయాలు అందుకుంటోంది. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో వెలువడనున్నాయి.
హిమాచల్ అసెంబ్లీకి ఒకే విడతలో ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి. గజరాత్ అసెంబ్లీ కి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ వచ్చే నెల 8న వెలువడతాయి. అయితే రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం తథ్యమనే ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలు పేర్కొన్నాయి. ఒక వైపు వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా.. జనం మాత్రం మోడీ పాలనవైపే మొగ్గు చూపుతున్నారు. ఇదేలా సాధ్యమంటే బీజేపీ వారు అదే మోడీ మ్యాజిక్ అంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో మోడీ తన అగ్రస్థానాన్ని మరో సారి నిలబెట్టుకున్నారు.
మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రపంచంలోని గొప్ప నేతలు ఎవరన్న అంశంపై నిర్వహించిన సర్వేలో మోడీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో 77శాతం రేటింగ్ తో మోడీ టాప్ గా నిలిచారు. మోడీ తరువాత రెండో స్థానంో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానికి దక్కిన రేటింగ్ 56శాతం మాత్రమే. ఇక అగ్రరాజ్యం జోబెడెన్ 44శాతం రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచారు.
ఇంకా ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో 39 శాతం రేటింగ్, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ 36శాతం రేటింగ్ ఉన్నారు. మొత్తం 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ గొప్ప నాయకుల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రభుత్వాలు, నేతల తీరును ట్రాక్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోడీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. అప్పటి కంటే తాజా సర్వేలో మోడీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.