సెటిలర్లపై కాషాయం కన్ను.. తెలంగాణలో అధికారానికి అదే దన్ను!
posted on Nov 26, 2022 @ 9:57AM
తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే. సెటిలర్ల మద్దతు అనివార్యమన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసింది. సెటిలర్ల మద్దతు సంపూర్ణంగా లేకుంటే తెలంగాణలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని భావిస్తున్న బీజేపీ ఇక ఇప్పుడు సెటిలర్ల ఓట్లపై గురిపెట్టిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గంపగుత్తగా సెటిలర్ల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలంటే.. తెలంగాణలో ఇప్పుడున్న తెలుగుదేశం స్థానానికి బీజేపీ చేరుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తెలంగాణలో కనీసం 40 స్థానాలలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్న అంచనాలున్నాయి. అందుకే బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం మద్దతు కోరుతోందని పరిశీలకులూ అంటున్నారు. 2019 ఎన్నికల వరకూ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీకి ఉన్న జన మద్దతును గానీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో అధికారం కనుచూపు మేరలో కనిపిస్తోందో.. రాష్ట్రంలో పార్టీ బలోపేతమై.. అధికార పగ్గాలు చేపట్టడానికి చేరువకు వచ్చిందన్న భావన వచ్చిందో.. అప్పటి నుంచీ కమలనాథుల దృష్టి సెటిలర్ల మద్దతు కూడగట్టడంపై కేంద్రీకృతమైంది.
అందులో భాగంగానే ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట రద్దైన ఆంధ్రా బీసీకులాల రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం బీజేపీ ఇప్పుడు గళమెత్తుతోంది. నాడు రద్దు చేసిన ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ పునరుద్ధరణ కోరుతూ గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం ఇవ్వడం వెనుక కారణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఎనిమిదేళ్ల కిందట కేసీఆర్ ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు ఏపీ బీసీ సంఘాలు వినా ఎవరూ స్పందించలేదు. ఇన్నేళ్లైన తరువాత ఇప్పుడు బీజేపీ నాడు రద్దు చేసిన రిజర్వేషన్ల పునరుద్ధరణకు గళం ఎత్తడం వెనుక సెటిలర్ల ఓట్లకు గాలం వేయడమనే లక్ష్యమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణపై పట్టు సాధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవడమే లక్ష్యంగా కాషాయదళం అడుగులేస్తోంది.
అందులో భాగంగానే రద్దైన ఆంధ్రా బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదాన్ని అందుకుంది. దీని వల్ల సెటిలర్ల ఓట్లతో పాటు బీసీల ఓట్లు గంపగుత్తగా తమ వైపు మళ్లుతాయని ఆశిస్తోంది. అయితే నాణేనికి రెండో వైపు ఈ రిజర్వేషన్ల పునరుద్ధరణ నిర్ణయం తెలంగాణ బీసీలను దూరం చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాలు వేరేగా ఉంటున్నాయంటున్నారు. సెటిలర్లు ఇప్పటి వరకూ తెలుగుదేశంకు అనుకూలంగానే ఉన్నారు తప్ప మరో పార్టీ వైపు చూపు సారించలేదు. అందుకే ఏపీలో బీసీ సంఘాలు సంతృప్తి చెందేలా.. రద్దైన రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదం అందుకుంటే వారికి దగ్గర కావచ్చునని బీజేపీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
విభజన తరువాత కూడా 21014 ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఐదు స్థానాలలో విజయం సాధించిన సంగతిని బీజేపీ ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నది. తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలో 15 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితిని పునరావృతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో సంబంధం లేకుండానే సెటిలర్లకు దగ్గరవ్వడానికి బీజేపీ ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఒక వేళ అలా సాధ్యం కాకపోతే.. ఆ పార్టీతో పొత్తుకు కూడా సిద్ధపడేందుకు బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.