జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు గుర్తింపు అంతంత మాత్రమేనా?
posted on Jan 30, 2023 @ 11:08AM
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీని విజయం వరిస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పుంజుకుందా? బీజేపీకి పోటీ ఉందా? అంటే వరుస సర్వేలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి సర్వేలలో రాహుల్ జోడో యాత్రలో కాంగ్రెస్ బాగా పుంజుకున్నప్పటికీ మొగ్గు బీజేపీ వైపే ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రభావం చూపే పార్టీలు, సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నాయి.
అయితే ఎక్కడా వచ్చేది రైతు రాజ్యమే.. మోడీ ఇంటికి.. మేం హస్తిన కు అంటూ గంభీరంగా ప్రసంగాలు దంచుతున్న కేసీఆర్ బీఆర్ఎస్ ను మాత్రం జాతీయ సర్వేలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ప్రధాని మోడీని, కేంద్రంలోని ఆయన సర్కార్ ను విమర్శించడంలో చాంపియన్ గా తనను తాను ప్రకటించుకుంటున్న కేసీఆర్ ను కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీని కానీ సర్వేలు పరిగణనలోనికి తీసుకోకపోవడానికి ఆ పార్టీ ఇంకా రాష్ట్రాలలో విస్తరించకపోవడమే కారణమని సరిపెట్టుకుం దామనుకున్నా.. కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం గురించి కూడా సర్వేలు ప్రస్తావించకపోవడం.. ప్రాంతీయంగా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ ఏడాది జరిగే తెలంగాణ అసెబ్లీ ఎన్నికలలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందన్న అంచనాలున్నాయి. అయితే జాతీయ స్థాయి సర్వేలు పూర్తిగా వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభావం చూపే అవకాశాలు లేవా అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి గుప్పిస్తూ జాతీయ మీడియాలో భారీ ప్రకటనలు గుప్పించి మరీ హైప్ కోసం ప్రయత్నించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నీ తమకు కూడా తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని కోరుతున్నాయంటూ మీడియాలో ప్రచారం కల్పించారు.
అయితే సర్వేల ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ ను జనం లైట్ గా తీసుకున్నారన్న భావాన్నే కలిగిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం జరిగి ఆరు నెలలు కావస్తోంది. పేరు మార్పు జరిగీ నెలలు గడిచాయి. అయినా ఇంత వరకూ జాతీయ స్థాయిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రభావం కానీ, జనంలో చర్చ కానీ జరగడం లేదు. ఖమ్మంలో భారీ సభ నిర్వహించినా, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనా.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను సీరియస్ గా తీసుకున్న పార్టీ ఏదీ అంటే జవాబు చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వినా బీజేపీయేతర కూటమి పట్ల ఏ పార్టీ కూడా పెద్దగా సుముఖంగా లేదు. ఈ విషయాన్ని ఆయా పార్టీలే ప్రకటిస్తున్నాయి.
తాజాగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి, ఆ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేసీఆర్ ఆహ్వానం పంపారు. అయితే కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను సభకు హాజరు కాబోవడంల లేదని సమాచారం ఇచ్చిన నితీష్ కుమార్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ వస్తారని పేర్కొన్నారు. అయినా బీఆర్ఎస్ సభకు హాజరైనంత మాత్రాన కాంగ్రెస్ తో పొత్తుకు విముఖమని కాదని ముక్తాయించారు. అంటే.. ఆయన మాటలను బట్టి బీఆర్ఎస్ తమ జట్టులో చేరితే చేరాలి కానీ.. తాము కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వెనుక ర్యాలీ కావడానికి సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.