కేసీఆర్ వర్సెస్ తమిళిసై.. కోర్టెక్కిన తగాదా?!
posted on Jan 30, 2023 @ 10:23AM
వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసింది. అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడటం లేదు.
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధం.. మరో సారి కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇలా అనడం కరెక్టో కాదో తెలియదు కానీ.. అత్తమీద కోపం దుత్త మీద చూపిన చందంగా కేంద్రంపై ఉన్న ఆగ్రహాన్ని గవర్నర్ వ్యవస్థపై చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.
వాస్తవానికి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినా.. రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసి ఇచ్చిందో అదే ‘ నా ప్రభుత్వం’ అంటూ చదవాలి. కానీ కేసీఆర్ ఆ మాత్రం అవకాశం కూడా గవర్నర్ కు ఇవ్వాలని భావించడంలేదు. అదే సమయంలో గవర్నర్ తమిళిసై కూడా తెగితే ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారనిపిస్తోంది. ప్రొటోకాల్ ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలకు దిగడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను కూడా తూర్పారపడుతున్నారు. అందుకు ఆమె మీడియా సమావేశాలనే ఉపయోగించుకుంటున్నారు.
గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొత్త కాదు కానీ.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తేంతగా ముదిరిపోవడం మాత్రం దేశంలో బహుశా ఇదే తొలిసారి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. వచ్చే నెల 3న బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పని సరి.. కానీ ఇప్పటి వరకూ గవర్నర్ నుంచి అటువంటి ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో పడింది. కోర్టు కెక్కి అనుమతి తెచ్చుకోవడం వినా గత్యంతరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. గత కొంత కాలంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లలకు తమిళిసై ఆమోదం తెలపకుండా, తిరస్కరించకుండా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం గవర్నర్ పై విమర్శలకు అదో ఆయుధంగా భావించిందే తప్ప సీరియస్ గా తీసుకోలేదు.
అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడాన్ని అలా వదిలేసే పరిస్థితి ప్రబుత్వానికి లేదు. ఈ నెల 21న గవర్నర్ కు ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఫైల్ ను ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ ఆమోదించలేదు. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరనుంది.
ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత ఏడాది కూడా ఇదే తరహాలో గవర్నర్ స్పీచ్ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెడితే గవర్నర్ అప్పుడు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగం లేకుండా చేయడాన్ని గవర్నర్ బాహాటంగానే తప్పుపడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి తెలంగాణ స్వయంకృతమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.