నేడో రేపో తెలంగాణకు కొత్త గవర్నర్ ?
posted on Jan 30, 2023 @ 11:51AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడున్నరేళ్లు పూర్తయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే, తెలంగాణకు కొత్త గవర్నర్ అన్న చర్చ గత కొంత కాలంగా సాగుతూనే ఉంది.
ఆ చర్చ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో మరింత జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళి సైకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించి, తెలంగాణకు కొత్త గవర్నర్ ని నియమించే అవకాశాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ , ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి నివాసం )కు మధ్య అగాధం ఇక పూడ్చలేనంతగా పెరిగిపోవడం, ఆ కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పై ప్రతి కూల ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో.. గవర్నర్ ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించడమే మేలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
బడ్జెట్ కు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కేంద్రంలోని మోడీ సర్కార్ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందన్న భావన కేంద్ర ప్రభుత్వ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఇప్పటికే కేంద్రం ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఈ నెల 21న గవర్నర్ కు బడ్జెట్ ఫైల్ ను ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ ఇంత వరకూ ఆమోదించలేదు సరి కదా, వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే సమస్య తీవ్రతను ప్రజలకు తెలియజేయడానికే తప్ప కోర్టుకు వెళ్లడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ మాత్రం దారుణంగా దెబ్బతింటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తమిళనాడులో ఉభయ సభలను ఉద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం విషయంలో తలెత్తిన వివాదం కేంద్రం పరువును నిండా ముంచింది.
ఎవరు ఒప్పుకున్నా లేకున్నా.. గవర్నర్ కేంద్రం ప్రతినిథిగా రాష్ట్రాలలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారన్న భావన బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంవత్సరంలో ఇటువంటి వివాదం మరింతగా ముదిరితే.. ఒక్క తెలంగాణలోనే కాక మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోనే తమకునష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. దీంతో పరిస్థితి మరింత ముదరక ముందే తెలంగాణ గవర్నర్ ను మార్చే అవకాశలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.