మంత్రి పదవి తోటకు అందని ద్రాక్షేనా?
posted on Oct 20, 2012 @ 12:11PM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ఊరిస్తున్న మంత్రి పదవి అందని ద్రాక్షేనా? ఈ ప్రశ్న నియోజకవర్గంలోని అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రత్యేకించి మంత్రి పదవి కోసమే త్రిమూర్తులు గెలిచారని ద్రాక్షారామ భీమేశ్వరుని ముందు అభిమానులు నమ్మబలికారు. దీంతో తోట కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తోటకు పెద్దగా మద్దతు లభించటం లేదు. ఎందుకంటే తాను పీఆర్పీ అని తోటే చెప్పుకుంటున్నారు. పైగా, ఎన్నికల్లో అసలు ప్రచారం వద్దనుకున్న చిరంజీవి వెనుక ఆయన నిలుస్తున్నారు. చిరంజీవికే కేంద్రమంత్రి పదవి విషయంలో సీరియస్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ ఆయన అనుచరునికి అంత త్వరగా కొరుకుడు పడుతుందా? వాస్తవానికి అంత శ్రమ లేకుండానే మంత్రి పదవి తోటకు వచ్చి ఉండేది. కానీ, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావించినట్లు తోట నడుచుకోవటం లేదు. దీంతో ఆయన కూడా వెనుకడుగు వేశారు. చిరంజీవి వర్గంగా తోటకు పబ్లిసిటీ బాగా జరుగుతున్నందున కిరణ్ మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఆలోచిద్దామని ఈ విషయాన్ని పక్కన పెట్టారు. పైగా, మంత్రి పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినందున ఎక్సయిజ్ మంత్రి పదవి తోటకు ఇవ్వాలని చిరంజీవి రికమెండ్ చేశారు. గెలిచిన రెండుస్థానాల్లోనూ కాంగ్రెస్ సహకారం లేకపోతే ఈ పీఆర్పీ అభ్యర్థులు లేరన్న వాస్తవాన్ని చిరంజీవి గ్రహించకపోవటం వల్లే ఈ మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ వెనుకడుగువేస్తోందని సమాచారం. లేకపోతే శాఖలు ఖాళీగా ఉన్నా మొత్తం భారం సిఎం మోయటానికి ఎప్పుడూ ఇష్టపడని కాంగ్రెస్ అస్సలు ఈ విషయం మాట్లాడటమే లేదు. ఒక్క మంత్రిని కూడా నియమించేందుకు తోట లాబీయింగ్ వల్ల ఇష్టపడటం లేదని తెలుస్తోంది.