తూ.గో.లో కోట్లాది రూపాయల గంజాయిసాగు?
posted on Oct 18, 2012 @ 10:08AM
తూర్పుగోదావరి జిల్లా గంజాయిసాగులో కోట్లాది రూపాయల స్థాయికి చేరుకుంది. పోలీసుల సహాయంతో ఇక్కడ అక్రమంగా ఈ సాగు జరుగుతోందన్న ఆరోపణలకు ఇటీవల ఆధారాలు మరిన్ని లభ్యమవుతున్నాయి. ఒకేసారి రమారమీ కోటిరూపాయలు విలువ చేసే సరుకు ఇక్కడి దాడుల్లో పట్టుబడుతోంది. స్మగ్లర్లు కూడా యధేశ్ఛగా సరుకు తరలించేందుకు భారీవాహనాలను ఉపయోగిస్తున్నారు. గంజాయి వాసన వల్ల దాన్ని గుర్తించి అబ్కారీశాఖ దాడులు చేస్తోంది. తాజాగా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో అబ్కారీశాఖ చేసిన దాడిలో రూ.70లక్షల విలువైన గంజాయి దొరికింది. అయితే అసలు స్మగ్లర్లు మాత్రం దొరకలేదు. ఈ వాహనంతో పాటు వెళుతున్న ఓ ముగ్గురిని అబ్కారీ శాఖ అదుపులోకి తీసుకుంది. ఇటీవల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కి, ఏజెన్సీ ప్రాంత డిఎస్పీ నవీన్‌కుమార్‌కు మధ్య ఈ గంజాయిసాగు విషయంలోనే వివాదం జరిగింది. ఆ వివాద సమయంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయిసాగు ఇక్కడ జరుగుతోందని డిఎస్పీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆరోపించినట్లే తాజాగా రూ.70లక్షల విలువైన సరుకు దొరికింది. ఇంకా విలువైన సరుకు రవాణాకు సిద్ధంగా ఉందని సమాచారం వస్తోంది. రాష్ట్రస్థాయిలో ఈ సాగుపై దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.