ఆలుగడ్డలు తిని ఆకలి తీర్చుకుంటున్న బెంగాల్ యువకులు
posted on Apr 18, 2020 @ 2:13PM
* క్రీస్తురాజపురం లో పశ్చిమ బెంగాల్ యువకుల ఆవేదన
లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటున్న వలస కార్మికుల అవస్థలు విజయవాడ లో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్థానికులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటున్న కార్మికులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వారి ఆందోళన కు మద్దతు పలికిన బిజెపి నేతలు మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర మీడియా కన్వీనర్ వుల్లూరిగంగాధర్.
షేక్ బాజీ మాట్లాడుతూ- మగ్గం పనుల కోసం పశ్చిమబెంగాల్ నుంచి విజయవాడ కు వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు, అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు, లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటున్నారు.. లేదా పస్తులు ఉంటున్నారని చెప్పారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడం తో వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు చేసుకోవడం లేదని, ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని, ఇక్కడ సాధ్యం కాదంటే...వారి సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని బాజీ కోరారు.
గంగాధర్ మాట్లాడుతూ-ఊరు కాని ఊరు వచ్చి వీరంతా అవస్థలు పడుతున్నారని, ఇటీవలే ఈ ప్రాంతానికి సమీపంలో రెడ్ జోన్ ప్రకటించారని, ఇరుకు గదుల్లో నివాసం ఉండే వీరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే నష్టం భారీగా ఉంటుందని, వీరి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లామనే, స్పందించి బెంగాల్ యువకుల ఆకలి తీర్చేలా ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాలంటర్ వ్యవస్థను తక్షణమే ఇక్కడకు పంపి వీరికి తగు సాయం చేయాలని గంగాధర్ డిమాండ్ చేశారు.