గతంలో మీ పత్రిక తెలుగు కోసం గుండెలు బాదుకోలేదా?
posted on Apr 18, 2020 @ 1:42PM
మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నబరుచుకుంటే ఎలా? ఇంగ్లిష్ నేర్పాలి, కానీ తెలుగుని అగౌరవపరిచే పద్ధతి మానుకోవాలి. మాతృభాషను రక్షించుకోవడం, ప్రచారం కల్పించుకోవడంలో కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, హిందీ వాళ్లను చూసి నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ‘మాతృభాషకు మంగళం’ అనే శీర్షికతో సాక్షి పత్రికలో కథనాలు ప్రచురించారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మీడియం కావాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పడేమో ఇంగ్లిష్ మీడియం అంటూ కపటనాటకాలు ఎందుకు?
‘దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం. పెంపొందిద్దాం. తెలుగు భాష అభ్యున్నతికి ఇంగ్లిష్ వాడైన బ్రౌన్ ఎంతగానో కృషి చేశాడు. మన తెలుగు నాయకులు మాత్రం మాతృభాష అంతరించిపోయే విధంగా చేస్తున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలి. 8వ తరగతి వరకు పిల్లలకు స్థానిక మాతృభాషలోనే బోధించాలని జాతీయ నూతన విద్యా విధానం కూడా చెబుతోంది. 1968, 1986 సంవత్సరాల్లో రూపొందించిన విధానాల్లోనూ ఇదే విషయం చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమం.. అంటే రెండూ ఉండాలని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీలు సూచించారు.
ఇప్పటి వరకు తెలుగులో చదివిన విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని, పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ర వేత్తలు సైతం మాధ్యమాన్ని పిల్లలే ఎంచుకునే అవకాశం ఉండాలని సూచించారు.