ఇక ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపు

సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. ఏడువిడతల ఎన్నికల షెడ్యూలులో భాగంగా జూన్ 1వ తేదీన చివరి విడతగా 57లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రాత్రి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.ఎగ్జిట్ పోల్స్ దాదాపు అటు కేంద్రంలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విజేతను  ప్రకటిస్తాయి.దీనికోసమే ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పెరిగిన ఓట్లు తమకే పడ్డాయని వైసీపీ కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ ఫలితాన్ని డిసైడ్ చేసేది మహిళా ఓటర్లేనని చెబుతూ వైసీపీ సంక్షేమం సొమ్ము పందేరం చేసిన  తామే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చెప్పుకుంటోంది. అదే విధంగా  కూటమి వర్గాలు పెరిగిన ఓట్లు తమవేననీ, విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  సందట్లో సడేమియాగా జ్యోతిష్యులు  గెలుపు ఎవరి దన్న విషయంపై జోస్యాలు చెప్పేస్తున్నారు.

 ఇక జాతీయ స్థాయిలో అధికారం మాదంటే మాదంటూ ఎన్డీయే, ఇండియా కూటములు చెప్పుకుంటున్నాయి. బీజేపీ అయితే ఆకాశమే హద్దు అన్నట్లుగా తమ కూటమి 400కు పైగా స్థానాలలో విజయం సాధిచడం ఖాయమని   అయితే ఇప్పటి వరకూ ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన పరిశీలకులు మాత్రం బీజేపీ  సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశాలు లేవనీ, అలాగే ఎన్డీయే కూటమి కలిసి 300 స్థానాలు వస్తే గొప్పేనని విశ్లేషిస్తున్నారు.  

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు ఇండియా కూటమికి ప్లస్ అయ్యిందనీ, అంత వరకూ అంతర్గత విభేదాలతో సతమతమౌతున్న ఆ కూటమిని కేజ్రీవాల్ అరెస్టు ఏకతాటిపైకి తీసుకువచ్చిందనీ చెబుతున్నారు. ఇక ఎన్డీయే కూటమిలో అనివార్యంగా చేరిన ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తే.. మళ్లీ పూర్తి సంఖ్యా బలంతో కేంద్రంలో బీజేపీ  నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మోడీ ప్రాంతీయ పార్టీలను మింగేస్తారన్న భయం వాటిలో ఉంది. ప్రాంతీయ పార్టీలలోని ఈ భయమే.. బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు రాకపోతే.. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ కొలువుదీరినా వాటి స్థానానికి ఢోకా ఉండదు. అదే సమయంలో తమ రాష్ట్ర సమస్యలపై బలంగా గళమెత్తి పరిష్కారించుకోగలిగే వెసులుబాటు ఉంటుందన్న భావన ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలలో వ్యక్తం అవుతోంది. 

ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం(జూన్ 1) చివరి విడత పోలింగ్ కూడా ముగుస్తుంది. దీంతో ఇప్పుడు అందరి చూపూ జూన్ 4న వెలువడనున్న ఫలితంపైనే ఉంది. శనివారం (జూన్ 1) సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వాటిని బట్టి అధికారంలోకి వచ్చేది ఎవరు అన్నదానిపై ఒక అంచనాకు రావచ్చు. దీంతో అందరి ఎదురు చూపూ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. 

Teluguone gnews banner