ఓటెత్తిన ప్రభుత్వ వ్యతిరేకత.. ఏపీలో 85శాతం పైనే పోలింగ్!
posted on May 14, 2024 @ 2:29PM
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇక పేద, బడుగు వర్గాల వారు తాము ఆరోగ్యంగా ఉండాలంటే అరకొర సంక్షేమం కాదనీ, ఆరోగ్యం ముఖ్యమని భావించారు. లేదంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంతో తమ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమన్న భయంతో ఓటు వేయడానికి తరలి వచ్చారు.
దీంతో గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ఓటింగ్ నమోదైతే ఈ సారి 82 శాతానికి పైగా పోలింగ్ జరిగిందన్నది అంచనా. దీనికి రికార్డు స్థాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అదనం. స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారిముఖేష్ కుమార్ మీనా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ భారీగా పెరిగిందని ప్రకటించారు. ఈవీఎంలు,పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే.. 85 శాతానికి మింతే పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ సానుకూల ఓటని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ ఎప్పుడూ వెల్లువలా సాగదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒక ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్న కసి, పట్టుదల ప్రజలలో ఉన్నప్పుడే ఓటు వేసి తీరాలన్న పట్టుదల జనం ప్రదర్శిస్తారనీ, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా లెక్క చేయకుండా పోలింగ్ బూత్ కు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనీ వారు సోదాహరణంగా చెబుతున్నారు. 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరగడంతో తెలుగుదేశం భారీగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 2019తో పోలిస్తే 2014లో పోలింగ్ శాతం మరింత పెరిగిందంటే.. వైసీపీ భారీగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.
2019 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పారు. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేననీ అప్పడు బల్లగుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇంత భారీగా పోలింగ్ నమోదయ్యిందంటూ అది కచ్చితంగా ప్రభుత్వ పాజిటివ్ ఓటు మాత్రమేనని అంటున్నారు. ఈ వాదంతో జనాలను ఎటూ నమ్మించలేరు, కనీసం పార్టీ క్యాడర్ అయినా నమ్మక పోతుందా అని తెగతాపత్రేయపడుతున్నారు. అయితే పార్టీ నేతలూ, క్యాడర్ కూడా ఆయన మాటలు నమ్మడం లేదని పోలింగ్ సందర్భంగా, పోలింగ్ తరువాత వారు మాట్లాడిన మాటలే రుజువు చేస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిథి అనిల్ కుమార్ యాదవ్ అయితే పోలీసులు అధికారులు వైసీపీ నేతలు, కార్యకర్తలను నియంత్రించి, తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని చెప్పడం ద్వారా ఎన్నికల ఫలితం ఏమిటో ఫలితాల వరకూ ఆగనవసరం లేకుండా ఆయనే చెప్పేశారు.
ఇక నగరి తెలుగుదేశం అభ్యర్థి రోజా అయితే పోలింగ్ పూర్తి కాకుండానే తన ఓటమిని అంగీకరించేశారు. తనను నగరిలో ఓడించడానికి సొంత పార్టీ నేతనే పని చేశారని చెప్పారు. ఇక చివరాఖరుగా చెప్పేదేమిటంటే.. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓటర్లు ఉప్పెనలా తరలి వచ్చి ఓటేసిన సందర్భం చరిత్రలో లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం జనం వెల్లువలా తరలివచ్చి ఓటు వేస్తారనడానికి చరిత్రలో ఎన్నో దాఖలాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఓటరు చైతన్యం ప్రభుత్వ అనుకూల ఓటా, వ్యతిరేక ఓటా అన్న విషయంపై కొత్తగా చర్చ చేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో జనం చైతన్యంతో ఓటెత్తారంటే వైసీపీకి ఘోర పరాజయం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.