ఫోన్ ట్యాపింగ్ కేసుకి జాతీయ హోదా!
posted on May 14, 2024 @ 2:59PM
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఢిల్లీ లిక్కర్ కేసును కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ వర్గాలు చాలా లైట్‌గా తీసుకున్నాయి. మోడీకి, ఈడీకి భయపడేదే లేదని కేసీఆర్ ఫ్యామిలీ అంతా యతిప్రాసలు ఉపయోగించి మాట్లాడారు. ఆ కేసుతో కవితకి ఎలాంటి సంబంధం లేదని సుద్దపూసలకి చుట్టాల మాదిరిగా మాట్లాడారు. చివరికి ఏమైంది.. డూప్లికేట్ బతుకమ్మ తీహార్ జైల్లో చిప్పకూడు తింటోంది. ఇప్పుడప్పుడే జైల్లోంచి బయటకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మంగళవారం నాడు ఢిల్లీ కోర్టు కవిత బెయిల్‌ని ఈనెల 20 వరకు పొడిగించింది. పరిస్థితి చూస్తుంటే కవిత జైలు జీవితం ఆంజనేయస్వామి తోకలాగా ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ ఇచ్చే బిల్డప్పలు, మేకపోతు గాంభీర్యాలు అన్నీ ఉత్తుత్తివే అని లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఇదే తరహా బిల్డప్పు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ఇస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి సోమవారం నాడు జర్నలిస్టులు కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో వున్నప్పుడు ఎంత పొగరుగా సమాధానం చెప్పారో, ఇప్పుడు కూడా అంతకు మించిన పొగరుగా సమాధానం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదట. పోలీసులదే మొత్తం పాపమట. ముఖ్యమంత్రి హోదాలో పోలీసులని మేం సమాచారం అడుగుతాం.. వాళ్ళు ఏమార్గంలో వెళ్ళి ఆ సమాచారం తెస్తారో మాకు సంబంధం లేదు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్లని ట్యాప్ చేసే అధికారం వుంది. అవసరమైతే ట్యాప్ చేసిన సమాచారాన్ని ధ్వంసం చేసే అధికారం కూడా పోలీసులకు వుంది అని చెప్పుకొచ్చారు. అంటే, ఈ ధ్వంసం చేసే వ్యవహారం కేసీఆర్‌కి తెలిసే జరిగిందన్నమాట. చట్టంలో ధ్వంసం చేయొచ్చు అని కూడా వుంది కదా.... అందుకని ట్యాపింగ్ చేసినంతకాలం చేసి, బయటపడే రోజు రాగానే ధ్వంసం చేశారన్నమాట.
‘ధ్వంసం చేయొచ్చని కూడా చట్టంలో’ వుంది అని కాళ్ళు ఊపుకుంటూ నిర్లక్ష్యంగా అంటే సరిపోదు... ఆ ధ్వంసం చేయడమే ఇప్పుడు కేసీఆర్ని జాతీయ స్థాయిలో నేరస్తుడిలా నిలబెట్టబోతోంది. ఫోన్ ట్యాపింగ్ చేసినంతకాలం చేసిన పోలీసులు, కేసీఆర్ కుర్చీలోంచి దిగిపోగానే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారు. వాళ్ళు ధ్వంసం చేసింది వాళ్ళు ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్కుల వరకు అయితే సర్లే అనుకోవచ్చు. దేశ రక్షణ, మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం కూడా వున్న హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేశారట. ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారంటే, అది కచ్చితంగా జాతీయ స్థాయి వ్యవహారమే. ఈ విషయాన్ని ఈమధ్యే రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన చెప్పారు. అంటే, త్వరలో కేసీఆర్, కేటీఆర్ జాతీయ స్థాయి నేరస్థులుగా ప్రమోషన్ పొందబోతున్నారన్నమాట.