మూగబోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ గొంతులు
posted on May 14, 2024 @ 12:43PM
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడతలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. వైసీపీ నేతల అరాచకాలు, హింసాకాండ మధ్య రాష్ట్రంలో ఓటర్లు బెదరకుండా, అదరకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే వరకూ విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీలో ఇప్పుడు ఆ ధీమా కనిపించడం లేదు. అస్తమానూ నోరెట్టుకు పడిపోయే వైసీపీ అధికార ప్రతినిథులు అనీల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు మూగనోము పట్టారు. డిఫెన్స్ లో పడ్డారు.
నిన్న మొన్నటి వరకూ గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఆ నేతలు ఇప్పుడు పోలంగ్ సందర్భంగా విపక్ష కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులూ, అధికార యంత్రాంగం వారికి మద్దతుగా నిలిచిందని ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం దాడులు తాము చేసి, కేసులు ప్రత్యర్థుల మీద నమోదయ్యేలా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు అన్యాయం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటున్నారు.
వైసీపీ అధికార ప్రతినిథి అనీల్ కుమార్ యాదవ్ అయితే మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను నియంత్రించిన పోలీసులు, తెలుగుదేశం నేతలు, శ్రేణులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చెలరేగిపోయేలా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణ ద్వారా తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఇక ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా అయితే.. తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే తన ఓటమి కోసం పని చేశారంటూ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కి ఫలితంతో పని లేకుండానే ఓటమిని అంగీకరించేశారు. బూతుల స్పెషలిస్ట్ కొడాలి నాని అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో కానీ, పోలింగ్ ముగిసిన తరువాత కానీ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. కుటుంబంతో సహా సాయంత్రం ఎప్పుడో వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. సాధారణంగా వీరు తెలుగుదేశంపై ఇష్టారీతిన పెద్ద నోరేసుకుని పడిపోవడంలో సిద్ధహస్తులు. అటువంటి వీరి నోరు మూతపడటమే.. గెలుపుపై వైసీపీలో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.