రాజకీయాలు ఇప్పుడు కాదు.. వైసీపీకి లోకేష్ హితవు
                            
                              
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు తరలివస్తున్నాయి. అయితే అదే సమయంలో  ప్రతిపక్షహోదా కూడా లేని వైసీపీ రాజకీయాలు చేస్తున్నది. పెట్టుబడులను అడ్డుకునే విధంగా రాజకీయవిమర్శలకు తెగబడుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. రాజకీయాలకు ఇంకా చాలా చాలా సమయం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడండి అంటూ వైసీపీకి పిలుపునిచ్చారు.  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటైన 16 నెలలలో  రాష్ట్రానికి  పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సోమవారం (నవంబర్ 3) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పెట్టుబడులలో అర్సేల్లర్ మిల్లర్ లక్షా ఐదువేల కోట్ల రూపాయలు, గూగుల్ 87 వేల కోట్ల రూపాయలు, అలాగే బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకం ఏర్పడేలా ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కరెక్టు కాదని ఆయన వైసీపీకి సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామనీ, ప్రస్తుతం సమష్టిగా రాష్ట్రప్రగతికి కృషి చేద్దామనీ లోకేష్ పిలుపునిచ్చారు. మేమే కాదు, మీరు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చునని,  రాష్ట్ర అభివృద్ధి అనేది సమష్టిగా చేయాల్సిన పని అనీ హితవు పలికారు.  పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరినైనా సిఫార్సులు చేస్తే ఆమోదిస్తామన్నారు.  
అదే సమయంలో వైసీపీపై విమర్శలూ గుప్పించారు.  విశాఖకు వచ్చిన గూగుల్ డేటా కేంద్రంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ జనంలో లేని పోని భయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  డేటా కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ పెరిగి చెట్టు పెరగవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు సత్యదూరాలన్న ఆయన  అన్నీ ఆలోచించే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.  దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా కేంద్రమేనన్న లోకేష్.. దీనివల్ల భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనీ,  విశాఖ రూపురేకలు కూడా ప్రపంచ స్థాయికి పెరుగుతాయన్నారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని, దీనికి సీఎం చంద్రబాబు విజనే కారణమని లోకేష్ వివరించారు.