ఆంధ్రా ఫస్ట్.. చంద్రబాబు బెస్ట్!
నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి.
ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే.. కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్ గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్ యువత భవితకు బంగరు బాటలు పరిచింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు.. కాదనలేరు. నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు. చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి.
రాజకీయ విభేదాలతో ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ కేంద్రంలో ఉన్నత స్థాయిలో వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలలో చంద్రబాబు విశిష్ఠతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు. అలాంటి వారిలో నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ఒత్తడి, ప్రోద్బలంతో చేశారని అనుకునేందుకు అవకాశమే లేదు.
ముందుగా నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రావడంపై స్పందించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ, చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే సాధ్యమౌతుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి విశాఖపట్నాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి
అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్ విధానాన్ని ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, ఏపీని అత్యున్నతంగా నిలబట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్.. ప్రణాళికలు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. గతం లో వాజపేయిని ఒప్పించి ఉమ్మడి రాష్ట్రానికి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు. నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం వెంట పడుతున్నారు. కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి ప్రాజెక్టుల్ని ప్రటికటించేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు.