వాలంటీర్లా.. రౌడీలా! సచివాలయ ఉద్యోగులపై వేధింపులా?
posted on Oct 28, 2021 @ 10:54AM
ఏపీలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. దాదాపు రెండున్నర లక్షల మందిని నియమించింది. వాలకు వేతనాలు కూడా చాలా తక్కువ. అయితే వాలంటీర్ వ్యవస్థను చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారు సీఎం జగన్ రెడ్డి.వాలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనమని చెప్పారు. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉండటంతో.. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వైసీపీ నేతల అండతో ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాలంటీర్లు లెక్కచేయం లేదనే వార్తలు వచ్చాయి. కొందరు ఉద్యోగులు వాలంటీర్లపై కేసులు పెట్టిన ఘటనలు కూడా జరిగాయి.
తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ ఉదయ్ కిరణ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. సిబ్బందిపై పెత్తనం చేస్తూ.. తాను చెప్పినట్లు వినకపోతే ఉన్నతాధికారులకు అనవసర ఫిర్యాదులు చేస్తున్నాడని, మహిళా సిబ్బందిపై తరచూ దుర్భాషలాడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వాలంటీర్ రెచ్చిపోతున్నాడు. వాలంటీర్ ప్రవర్తనతో విసుగు చెందిన సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు
మరోవైపు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీశైలం మండలం, సున్నిపెంటలోని నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఎంపీడీవో మోహన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్, మొబైల్ ఫోన్లు పంచాయితీ కార్యదర్శికి అప్పజెప్పాలని ఆదేశించారు. విధుల నుంచి తొలగించిన వాలంటీర్లు.. వినోద్ కుమార్, ప్రవల్లిక, శివాజీ, రాకేష్.